అలివికాని చోట అధికుల‌మ‌న‌రాదు! అని ఓ సామెత‌. మ‌న టైం బాగోన‌ప్పుడు, మ‌న‌కు అనుకూలంగా ప‌రిస్థితి లేన‌ప్పుడు కూడా మ‌నం పైచేయి సాధిస్తామంటే కుద‌ర‌ద‌ని దీని అర్ధం. అయితే, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం దీనికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అన్ని స‌మ‌యాల్లోనూ త‌న‌దే పైచేయి అనిఅనిపించుకునేందుకు రెడీ అయ్యారు. ప్ర‌స్తుతం ఏపీలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంది. దీంతో స‌మీక్ష‌లు, అధికారుల‌తో స‌మావేశాలు వంటివి చేయ‌రాద‌ని స్ప‌ష్టంగా ఎన్నిక‌ల నియ‌మావ‌ళి చెబుతోంది. దీనిపైనే ప్ర‌తి ప‌క్షం వైసీపీ కూడా పోరాడుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు చంద్ర‌బాబు అడుగులకు అడ్డుచ‌క్రం వేస్తోంది. ఈసీని నిల‌దీస్తోంది. అయినా కూడా చంద్ర‌బాబు త‌న ప‌ద్ధ‌తిని ఏమాత్రం మార్చుకోవ‌డం లేద‌ని అంటున్నారు అధికారులు. 


తాజాగా చంద్ర‌బాబు సూచ‌న‌ల మేర‌కు మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి వ్య‌వ‌సాయ శాఖ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష కు రెడీ అయ్యారు. రాష్ట్రంలో ఇటీవల అకాల వర్షాలకు ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడం, కరవు పరిస్థితుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, ఖరీఫ్‌ సాగుకు చేపట్టాల్సిన ముందస్తు ప్రణాళికలు, రైతులకు రాయితీ విత్తనాల పంపిణీకి చేపట్టాల్సిన చర్యలు, ఫణి తుఫాన్‌ నేపథ్యంలో రైతులకు ఇవ్వాల్సిన సూచనలపై మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి హాజరు కావాలని ఏప్రిల్‌ 24నే వ్యవసాయశాఖ ముఖ్యకార్య దర్శి రాజశేఖర్‌, ప్రత్యేక కమిషనర్‌ మురళీధర్‌రెడ్డిలకు మంత్రి కార్యాలయం నుంచి లేఖలు పంపారు. మంత్రి పంపిన వర్తమానాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వ్యవసాయశాఖ అధికారులు పంపారు.


ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం దీనిపై సూటిగా ఏ విషయం తెలపకుండా ఎన్నికల నిబంధనల ప్రకారం వ్యవహ రించాలని సూచిస్తూ ఎన్నికల కోడ్‌ నిబంధనల ప్రతిని జతచేసి పంపింది. దీంతో అధికారులు త‌మ నెత్తిమీద‌కి తెచ్చుకో వ‌డం ఎందుక‌ని మౌనం వ‌హించ‌డ‌మే కాకుండా అమ‌రావ‌తి మొహం కూడా చూడ‌లేదు. దీంతో మూడు గంట‌ల‌కు పైగానే మంత్రి త‌న ఛాంబ‌ర్‌లో వెయిట్ చేసి మ‌రీ ఇంటి ముఖం ప‌ట్టారు. అయితే, ఆయా విష‌యాల‌ను గ‌మ‌నించిన టీడీపీ సీనియ‌ర్లు.. ఇప్పుడు ఎందుకు తొంద‌ర‌ప‌డ‌డం, మౌనంగా ఉంటే పోలా! అని అంటున్నారు. మ‌రికొంద‌రు నేరుగా కాక‌పోయినా.. చంద్ర‌బాబును ప‌రోక్షంగా విమ‌ర్శిస్తున్నారు. ఆయ‌న 40 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఏమైంది ? అని ప్ర‌శ్నిస్తున్న సొంత పార్టీ నేత‌లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్నందున ఆయ‌న చేసే హ‌డావుడికి బ‌దులు మేము కూడా చేస్తే.. మేం కూడా ఇరుక్కుపోతాం అని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి ఈ విష‌యంలో చంద్ర‌బాబు వెన‌క్కి త‌గ్గాల్సిన ప‌రిస్థితి మాత్రం ఎదురైంద‌ని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: