ఎన్నిక‌ల ప్ర‌చారంలోనే కాక‌రేపిన కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాలు ఎన్నిక‌ల త‌ర్వాత కూడా ఓ యుద్ధంలా మారాయి. ఎన్నిక‌ల ప్ర‌చారంతో పాటు పోలింగ్ రోజుల రెండు పార్టీల నాయ‌కుల మ‌ధ్య నియోజ‌క‌వ‌ర్గంలో తీవ్ర‌మైన వైరుధ్యం ఏర్ప‌డింది. చివ‌ర‌కు విజ‌య‌వాడ రూర‌ల్ మండ‌లంలోని ప్ర‌సాదంపాడులోని ఓ పోలింగ్ బూత్‌లో పోలింగ్ అర్ధ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు సాగింది. ఇదిలా ఉంటే ఎన్నిక‌లు ముగిసి ఫ‌లితాల కోసం అంద‌రూ వెయిట్ చేస్తోన్న వేళ ఇప్పుడు టీడీపీ అభ్య‌ర్థి వ‌ల్ల‌భ‌నేని వంశీ వైసీపీ అభ్య‌ర్థి యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావుతో పాటు మాజీ ఎమ్మెల్యే దాస‌రి బాల‌వ‌ర్థ‌న్‌రావును టార్గెట్‌గా చేసుకుని బెదిరింపుల‌కు దిగుతున్న‌ట్టు ఆ ఇద్ద‌రు నేత‌లు ఆరోపిస్తున్నారు.


వంశీ తనను బెదిరిస్తున్నాడంటూ వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, వైసీపీ నేత దాసరి బాలవర్దనరావు బుధవారం సీపీని కలవడంతో గ‌న్న‌వ‌రం రాజ‌కీయం ఆస‌క్తిక‌రంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో గన్నవరం, గుడివాడ, మైలవరం ఉన్నాయి. ఈ సారి గన్న‌వ‌రంలో వంశీని ఎలాగైనా ఓడించాల‌ని వైసీపీ ఎన్ఆర్ఐ యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావును రంగంలోకి దింపింది. వంశీకి ధీటుగా సామాజిక‌, అర్ధిక‌ప‌రంగా బ‌లంగా ఉన్న వెంక‌ట్రావు ఈ సారి వంశీకి గ‌ట్టి పోటీ ఇచ్చారు. వంశీ ఈ సారి గెలుస్తాడా ? అంటే ఆ పార్టీ వాళ్లే ఏమో చెప్ప‌లేం అంటున్నారు. ఈ అక్క‌సుతో టీడీపీ నేతలు పోలింగ్ ముగిశాక కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ల‌ను టార్గెట్ చేస్తున్నారు.


తాజాగా వంశీ వైసీపీ అభ్య‌ర్థి వెంక‌ట్రావుకే ఫోన్ చేసి వ్య‌గ్యంగా మాట్లాడుతుండ‌డంతో పాటు మీరు ఎన్నిక‌ల్లో గెలుస్తున్నారు.. స‌న్మానం చేస్తాన‌ని అన‌డంతో వైసీపీ నాయ‌కులు అవాక్క‌వుతున్నారు. వెంక‌ట్రావుకు ఫోన్ చేసిన వంశీ... ఆ త‌ర్వాత నేరుగా ఆయ‌న ఇంటికి కూడా వెళ్లారు. ఆయ‌న ఇంట్లో లేక‌పోవ‌డంతో వంశీ వెనుదిరిగారు. అంత‌కు ముందే వెంక‌ట్రావుతో ఫోన్‌లో స‌న్మానం చేస్తాన‌ని వ్య‌గ్యంగా అన్న‌ట్టు కూడా స‌మాచారం. ఇక మ‌రో మాజీ ఎమ్మెల్యే బాల‌వ‌ర్థ‌న్‌రావుకు ఫోన్ చేసిన వంశీ ఆయ‌న్ను క‌లుస్తాన‌ని చెప్ప‌గా అందుకు ఆయ‌న తిర‌స్క‌రించారు. బాల‌వ‌ర్థ‌న్‌రావు గ‌తంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి...ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి జంప్ చేసిన సంగ‌తి తెలిసిందే.


ఈ క్ర‌మంలోనే ఈ ఇద్ద‌రు వైసీపీ నేత‌లు న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ ద్వార‌కాతిరుమ‌ల రావును క‌లిసి వంశీ త‌మ‌ను బెదిరిస్తున్నార‌ని ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా వంశీ త‌మ ఇంటికి వ‌చ్చిన సీసీ ఫుటేజ్ కూడా సీపీకి ఇచ్చారు. ఏదేమైనా కౌంటింగ్ జ‌రిగి ఫ‌లితాలు తేలే వ‌ర‌కు... ఆ త‌ర్వాత కూడా గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత‌ల తీరుతో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొనే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: