తెలంగాణ‌లో ఈ నెల 23న ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత కేసీఆర్ కేబినెట్‌లో పలువురు కొత్త ఎమ్మెల్యేల‌కు కేబినెట్ బెర్త్‌లు ద‌క్క‌నున్నాయి. 2014 ఎన్నికల్లో కేసీఆర్ బోటాబోటీ మెజార్టీతోనే గెలిచిన కేసీఆర్ టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప‌లువురు ఎమ్మెల్యేల‌ను కారెక్కించేసుకుని వారికి మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చేశారు. అస‌లు ఎన్నిక‌ల్లో గెల‌వ‌ని తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు లాంటి వాళ్ల‌ను సైతం ఎమ్మెల్సీలు చేసి మంత్రుల‌ను చేశారు. ఇక ఇత‌ర పార్టీల నుంచి గెలిచిన త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి లాంటి వాళ్ల‌కు కూడా కేబినెట్ బెర్త్‌లు ఇచ్చారు.


ఇక 2018 ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కు ఆ అవ‌స‌ర‌మే లేకుండా పోయింది. టీఆర్ఎస్‌కు తెలంగాణ ప్ర‌జ‌లు పూర్తి మెజార్టీతో బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. కేసీఆర్ ఇత‌ర పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేల‌ను చేర్చుకునే అవ‌స‌రం కూడా లేదు. అయినా కేసీఆర్ మాత్రం తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష పార్టీలు లేకుండా చేయాల‌న్న ఉద్దేశంతో మ‌ళ్లీ గేట్లు ఎత్తేశారు. ఇద్ద‌రు ఇండిపెండెంట్ల‌తో పాటు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను కారెక్కించేసుకున్నారు. ఫైన‌ల్‌గా కాంగ్రెస్‌కు ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్ర‌మే మిగిలే ఛాన్స్ ఉన్నా... వీరిలో కూడా ఇద్ద‌రు ఫ‌లితాల త‌ర్వాత కారు గూటికి చేరుకుంటార‌ని టాక్‌.


ఇక టీడీపీ నుంచి గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల్లో ఇప్ప‌టికే ఒక‌రు కారెక్కేయగా... రెండో ఎమ్మెల్యే సైతం అదే బాట‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే పూర్తిగా త‌న కేబినెట్‌ను విస్త‌రించ‌ని కేసీఆర్ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత పూర్తి కేబినెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారికి కూడా త‌న కేబినెట్‌లో చోటు క‌ల్పిస్తున్న‌ట్టు తెలంగాణ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఓ మ‌హిళా ఎమ్మెల్యేతో పాటు... టీడీపీ నుంచి కారెక్కే ఓ ఎమ్మెల్యేకు సైతం మంత్రి ప‌ద‌వులు ఖాయ‌మ‌ట‌.


ఇక టీఆర్ఎస్‌కు భారీ మెజార్టీ వ‌చ్చింది. చాలా మంది సీనియ‌ర్లు మంత్రి ప‌ద‌వులు ఆశిస్తున్నారు. వీరిని కాద‌ని మ‌రీ ఇప్పుడు కూడా ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారికి మంత్రి ప‌ద‌వులు ?  ఏంట‌న్న ప్ర‌శ్న‌లు టీఆర్ఎస్ వ‌ర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఏదేమైనా తెలంగాణ‌లో మ‌రో ఐదేళ్ల వ‌ర‌కు కేసీఆర్‌, టీఆర్ఎస్‌కు ఎదురు లేక‌పోవ‌డంతో కేసీఆర్ ఏం చేసినా ఎవ్వ‌రూ నోరు మెదిపే ప‌రిస్థితి లేదు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: