నేడు దేశ వ్యాప్తంగా ఐదో విడత లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి.  ఐదో దశలో మొత్తం 674 మంది అభ్యర్థులు బరిలో నిలవగా వీరిలో 12 శాతం మంది మహిళలే. మూడు విడతల్లో ఎన్నిక నిర్వహిస్తోన్న అనంతనాగ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి నేటితో పోలింగ్‌ ముగియనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, యూపీయే ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జౌళిశాఖ మంత్రి స్మృతిఇరానీ తదితర ప్రముఖులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

కేంద్ర సహాయ మంత్రులు అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌, జయంత్‌సిన్హా, ఝార్ఖండ్‌ మాజీ సీఎం అర్జున్‌ ముండా, జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ, కేంద్ర మంత్రి, మాజీ ఒలింపియన్ రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌, డిస్కస్ త్రోయర్ కృష్ణపునియా తదితరులు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. తాజాగా సినీ, రాజకీయ, క్రీడా నేపథ్యంలో ఉన్నవారు తమ ఓటు హక్కు వినియోగించుకొని ఓటు విలువ ప్రజలకు తెలియజేస్తున్నారు.  తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఓటు వేశారు.

జార్ఖండ్ రాజధాని రాంచీలోని జవహర్ విద్యా మందిర్ పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ధోని తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ధోని పిలుపునిచ్చారు. యూపీలోని 14,జార్ఖండ్ లోని 4,బీహార్ లోని 5,వెస్ట్ బెంగాల్ లోని 7,రాజస్థాన్ లోని 12,మధ్యప్రదేశ్ లోని 7,జమ్మూకశ్మీర్ లోని 2లోక్ సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: