ఏపీలో రాజకీయాల గురించి ప్రస్తావన వస్తే తప్పక చర్చకొచ్చే జిల్లా కృష్ణా. తొలి నుంచి ర‌స‌వ‌త్త‌ర రాజకీయాలకు కేంద్ర‌బిందువుగా ఉన్న ఈ జిల్లాలో ఈ సారి టీడీపీ, వైసీపీ మ‌ధ్య హోరాహోరీ పోరు న‌డిచింది. గ‌త ప‌దిహేనేళ్లుగా టీడీపీకి కంచుకోట‌గా ఉన్న ఈ జిల్లాలో ఈ సారి మార్పులు వ‌చ్చిన‌ట్టు పోలింగ్ స‌ర‌ళి చెప్పేసింది. 2009లో ప్ర‌జారాజ్యం పోటీ చేసిన‌ప్పుడే జిల్లాలో 16 అసెంబ్లీ సీట్ల‌కు టీడీపీ 8 గెలుచుకుని ఆధిప‌త్యం చాటింది. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 10 స్థానాలను దక్కించుకుని సత్తా చాటింది. అప్పటికి టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ పొత్తులో భాగంగా కైకలూరు స్థానం గెలుచుకుంది. వైసీపీ 5 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఆ త‌ర్వాత ఇద్ద‌రు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేశారు. ఈ ప‌రిణామాల‌ను స‌వాల్‌గా తీసుకున్న జ‌గ‌న్ ఈ సారి మాత్రం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేల‌పై బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను పోటీలో పెట్టారు.


ఇక జిల్లాలో మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాలు అన్ని ఒక ఎత్తు... గుడివాడ‌, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాలు మ‌రో ఎత్తు. మైల‌వ‌రంలో త‌మ‌కు కొర‌క‌రాని కొయ్య‌గా ఉన్న మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావును ఓడించేందుకు వైసీపీ పెద్ద క‌స‌ర‌త్తు చేసింద‌. ఇక్క‌డ నుంచి దేవినేని ఫ్యామిలీతో సుదీర్ఘ‌మైన రాజ‌కీయ వైరం ఉన్న వ‌సంత ఫ్యామిలీ నుంచి వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్‌ను రంగంలోకి దింపింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ఇద్ద‌రు గెలిచేందుకు కొద‌మ‌సింహాల్లా పోటీ ప‌డ్డారు. ఉమాను ఓడించేందుకు కృష్ణ‌ప్ర‌సాద్ కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు. ఎక్క‌డా వెనుకాడ‌లేదు. అటు ఉమా సైతం గెలిచేందుకు చెమ‌టోడ్చారు. గ‌త నాలుగు ఎన్నిక‌ల్లో చెమ‌ట చుక్క చింద‌కుండా గెలిచిన ఉమా ఈ సారి గెలిస్తే చాలు దేవుడా అనుకుంటోన్న ప‌రిస్థితి.


ఇక టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న నియోజ‌క‌వ‌ర్గం గుడివాడ‌. ఎన్టీఆర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో పాటు ఆయ‌న గ‌తంలో గెలిచిన ఈ నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కోట‌గా మారింది. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో నాని గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా గెలుస్తూనే ఉన్నాడు. ఈ సారి నానిని ఓడించేందుకు టీడీపీ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది. అందుకు దేవినేని నెహ్రు కుమారుడు, యువనాయకుడైన దేవినేని అవినాష్ అయితేనే కరెక్ట్ అని ఆ పార్టీ భావించింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రావి వెంకటరావుకు నచ్చజెప్పి దేవినేని అవినాష్‌ను అక్క‌డ రంగంలోకి దింపింది. అవినాష్ నానిని ఓడించేందుకు ఆర్థికంగా తెగించి కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలుస్తోంది. అటు నాని అవినాష్‌కు ధీటుగా డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌డంలో వెన‌కంజ‌లో ఉన్నా ఇద్ద‌రి మ‌ధ్య హోరాహోర పోరు సాగింది. 


ఏదేమైనా కృష్ణా జిల్లాలో రెండు ఎంపీ సీట్లు, 14 అసెంబ్లీ సీట్లు ఒక ఎత్తు అయితే టీడీపీకి గుడివాడ‌, వైసీపీకి మైల‌వ‌రం ఒక ఎత్తుగా ఉన్నాయి. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు పార్టీల గెలుపు, ఓట‌ముల‌పై విజ‌య‌వాడ‌లోనే కాకుండా, హైద‌రాబాద్‌లోనూ భారీ ఎత్తున బెట్టింగులు న‌డుస్తున్నాయి. మ‌రి గుడివాడ‌లో నానిని ఓడించి టీడీపీ క‌సి తీర్చుకుంటుందా ?  మైల‌వ‌రంలో ఉమాకు చెక్ పెట్టి వ‌సంత హీరో అవుతాడా ? అన్న‌ది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: