ఏపీలో జరిగిన సాధారణ ఎన్నికల్లో  అధికార తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు సీనియర్ నేతల వార‌సులు ఈ ఎన్నికల్లో తొలిసారి బరిలో ఉన్నారు. మూడు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్న సీనియర్ నేతలు, మంత్రులు, ఇప్పటికే పార్టీలో మూడు నాలుగు సార్లు గెలిచిన నేతలంతా స్వచ్ఛందంగా తప్పుకుని ఈ ఎన్నికల్లో తమ వారసులను పోటీ చేయించారు.  ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యామ్‌ బాబు పత్తికొండ నుంచి పోటీ చేస్తే, మంత్రి పరిటాల సునీత తన తనయుడు శ్రీరామ్ కోసం రాప్తాడు త్యాగం చేశారు. 


ఇక అశోక్ గజపతిరాజు తన కుమార్తె అదితిని విజ‌యన‌గ‌రం నుంచి అసెంబ్లీకి పోటీ చేయించారు. అలాగే గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు గాలి భాను ప్రకాష్ నాయుడు నగరి నుంచి, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి శ్రీకాళహస్తి నుంచి పోటీ చేశారు. పెడనలో కాగిత వెంకటరావు వారసుడు సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రాజమహేంద్రవరం ఎంపీ సీటు నుంచి మాగంటి మురళీమోహన్ కోడలు, అనంతపురంలో  జెఎసి వారసులు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఉన్నారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగితే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్న టిడిపి వార‌సుల్లో చాలామంది ఓటమి కోరల్లో చిక్కుకుని విల‌విల్లాడుతున్నారు. 


రాప్తాడులో పరిటాల శ్రీరామ్‌కు ఈ సారి గెలుపు అంత సులువు కాదు. ఇక్కడ గత రెండు ఎన్నికల్లోనూ ఓడిపోతున్న‌ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై ఈ సారి సానుభూతి వెల్లువ‌లా వ్యక్తమవుతోంది. పరిటాల కుటుంబానికి ముందు నుంచి కాసే బీసీ సామాజిక వర్గాల్లో మార్పు రావటం, ఐదేళ్లలో నియోజకవర్గంలో మంత్రి అండదండలు చూసుకుని టీడీపీ శ్రేణులు రెచ్చిపోవడం ఇప్పుడు శ్రీరామ్ గెలుపునకు అవరోధాలుగా ఉన్నాయి. రాప్తాడులో పోలింగ్ ముగిశాక శ్రీరామ్ గెలుపు సులువు కాదని అంటున్నారు. 


ఇక విజయనగరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన అదితి సైతం ఏటికి ఎదురీదుతూ ఉన్నారు. ఇక్కడ వైసిపి నుంచి పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి పోటీ చేశారు. ఈ నియోజకవర్గం నుంచి పలు సార్లు పోటీ చేసిన అనుభవం ఉన్న వీరభద్రస్వామి ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు గత ఐదేళ్లుగా తీవ్రంగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. సామాన్యుడిగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటున్న ఆయనను ఈ సారి గెలిపించాలనే భావన విజయనగరం నియోజకవర్గ ఓటర్లలో కనిపించింది. 


ఇక పత్తికొండలో కేఈ వారసుడు కేఈ శ్యామ్‌ బాబు ఓటమి ఖరారైందని ప్రచారం అప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ హత్య రాజకీయాల్లో శ్యామ్‌ బాబు పేరు ప్రముఖంగా మారడంతో నియోజకవర్గ ప్రజలు ప్రత్యక్ష ఎన్నికల్లోకి రాకముందే శ్యాంబాబు హత్యా రాజకీయాలు చేస్తున్నాడంటే రేపు గెలిస్తే పత్తికొండలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అన్న సందేహాలు వ్యక్తం చేశారు. ఇదే ఇప్పుడు పోలింగ్‌లో శ్యాంబాబుకు వ్యతిరేకంగా ఓటింగ్ జ‌రిగిన‌ట్టు ప‌త్తికొండ నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ న‌డుస్తోంది. ఏదేమైన ఈ ముగ్గురు వార‌సుల‌తో పాటు తొలి సారి ఎన్నిక‌ల ర‌ణ‌క్షేత్రంలో ఉన్న మ‌రో ముగ్గురు వార‌సులు కూడా ఎన్నిక‌ల్లో ఏటికి ఎదురీదుతున్న‌ట్టే తెలుస్తోంది. తొలి ఎన్నికలే టీడీపీ వారసులకు ఓ పీడకలగా మిగిలిపోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: