ప్రతి ఆదివారం కొత్త పలుకు శీర్షిక ద్వారా రాజకీయ విశ్లేషణ అందించే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తన తాజా విశ్లేషణలో భలే ఆసక్తికమైన పాయింట్లు లేవనెత్తారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ రెండింటికీ సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం లేదని చెబుతున్న ఆయన దాని పర్యవసానాలపై చర్చించారు. 


కేంద్రంలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడాలంటే ఉత్తరాది పార్టీల బలం ఎంత ముఖ్యమో, దక్షిణాది పార్టీల బలం కూడా అంతే ముఖ్యం అవుతుందంటున్న రాధాకృష్ణ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక పాత్ర పోషిస్తారని అంచనా వేస్తున్నారు. కేసీఆర్ ఉపప్రధాని పదవిపై కన్నేసారని అంచనా వేస్తున్న ఆయన.. అందుకు అనుగుణంగానే మద్దతు ఇస్తారని చెబుతున్నారు. 

కాంగ్రెస్ కూటమిలో నాయకత్వ సమస్య ఉన్నందున..ప్రధానమంత్రి పదవికి అభ్యర్థి విషయంలో ఆ పదవికి పోటీపడుతున్న వారి మధ్య సఖ్యత కుదరని పక్షంలో చంద్రబాబు పేరు తెర మీదకు వచ్చే అవకాశం కచ్చితంగా ఉందంటున్నారు రాధాకృష్ణ. అలాంటి అవకాశం వస్తే కాదనుకోకూడదని తెలుగుదేశం నాయకులు కోరుకుంటున్నారట.  అయితే చంద్రబాబుకు మాత్రం రాష్ట్రాన్ని వదిలిపెట్టాలని లేదట. 

అలాగే  తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో డీఎంకే, టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు 60 స్థానాలకు పైగా వస్తే ఈ మూడు పార్టీల బలం కీలకం అవుతుంది. బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పాటులో కేసీఆర్‌ సహకరిస్తే ఆయన ఉప ప్రధాని కావడానికి చంద్రబాబుకు అభ్యంతరం ఉండదట. ప్రస్తుతానికి ఈ ఇరువురి మధ్య సంబంధాలు ఉప్పు–నిప్పుగా ఉన్నప్పటికీ ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్‌రెడ్డికి ఆశించిన సీట్లు లభించని పక్షంలో కేసీఆర్‌ తన వైఖరి మార్చుకుని చంద్రబాబుతో చేతులు కలపడానికి సిద్ధపడే ఉందని రాధాకృష్ణ అంచనా వేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: