ఏపీలో గ‌త నెల జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ హోరాహోరీగా త‌ల‌ప‌డ్డాయి. ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రు ?  విజ‌యం సాధించారో తెలిసేందుకు అంద‌రి క‌ళ్లు ఇప్పుడు ఈ నెల 23వ తేదీపైనే ఉన్నాయ్‌. మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌ని అటు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నాలు చేస్తే, ఈ సారి ఎలాగైనా గెలిచి సీఎం అవ్వాల‌ని వైఎస్‌.జ‌గ‌న్ విశ్వ‌ప్ర‌య‌త్నాలతో ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా పోరాటాలు చేశారు. ఇక ఎవ‌రి అంచ‌నాలు ఎలా ? ఉన్నా మెజార్టీ స‌ర్వేలు, మేథావుల విశ్లేష‌ణ‌లు మాత్రం వైసీపీయే అధికారంలోకి వ‌స్తుంద‌ని తేల్చేశారు. 

ఇదిలా ఉంటే నేష‌న‌ల్ మేగ‌జైన్ వైసీపీ, టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన అభ్య‌ర్థుల చ‌దువు, వివ‌రాల‌పై ఇండియాటుడే గ్రూప్‌న‌కు చెందిన ఇండియాటుడే గ్రూప్ ఇంటిలిజెన్స్ యూనిట్ ఆస‌క్తిక‌ర స‌ర్వే చేసింది. ఈ స‌ర్వేలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. ఇవి ప‌లు జాతీయ పార్టీల‌తో పాటు, ప్రాంతీయ పార్టీల‌కు సైతం షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఈ ఎన్నిక‌ల్లో దేశ‌వ్యాప్తంగా పోటీ చేసిన ప‌లు రాజకీయ పార్టీల అభ్య‌ర్థుల చ‌దువు, అర్హ‌త‌ల‌పై ఈ సర్వే జ‌రిగింది. ఈ స‌ర్వే కోసం ఈ సంస్థ అభ్య‌ర్థులంద‌రూ స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ వివ‌రాలు తీసుకుంది. 

ఈ స‌ర్వేలో జగన్ నేతృత్వంలోని వైసీపీ దేశంలోనే తొలిస్థానంలో నిలిచినట్లు ఇండియా టుడే గ్రూపు తెలిపింది. వైసీపీ నుంచి ఏపీలో పోటీ చేసిన ఎంపీ క్యాండెట్స్‌లో 88 శాతం మంది అభ్య‌ర్థులు డిగ్రీ లేదా అంత‌కంటే ఎక్కువ చ‌దువులు చ‌దువుకున్నార‌ని చెప్పింది. ఈ జాబితాలో ద‌క్షిణాదికే చెందిన ప్రాంతీయ పార్టీ డీఎంకే రెండో స్థానంలో ఉంది. ఈ పార్టీ నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేసిన వారిలో 87.5 శాతం డిగ్రీ హోల్డ‌ర్లు ఉన్నారు.

ఇక త‌మిళ‌నాడులోనే అధికార పార్టీ అయిన అన్నాడీఎంకే నుంచి మొత్తం 86.4 శాతం డిగ్రీ హోల్డ‌ర్లు ఉన్నారు. దీంతో అన్నాడీఎంకే మూడోస్థానంలో ఉంది. ఇక తెలంగాణాలో టీఆర్ఎస్ 82.4 శాతం డిగ్రీ హోల్డర్లతో తొలి స్థానంలో, దేశవ్యాప్తంగా నాలుగో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో ఈసారి 139 మంది నిరక్షరాస్యులు బరిలో ఉన్నట్లు ఈ స‌ర్వే స్ప‌ష్టం చేసింది. ఇక దేశంలోనే ఎంతోమందికి రాజ‌కీయాలు నేర్పాన‌ని చెప్పుకునే చంద్ర‌బాబు అధ్య‌క్షుడిగా ఉన్న టీడీపీ ప్ర‌స్తావ‌నే ఈ స‌ర్వేలో లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: