ఏపీలో ప్ర‌ధాన విప‌క్షం వైసీపీ ఎట్టి ప‌రిస్థితిలోనూ విజ‌యం సాధించి అధికారంలోకి రావాల‌ని ఉవ్విళ్లూరుతున్న నేప‌థ్యం లో  ఆపార్టీ త‌ర‌ఫున ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అభ్య‌ర్థుల గెలుపు ఓట‌ముల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌సాగుతోంది. ఈ క్ర‌మంలోనే కీల‌క‌మైన ఇద్ద‌రు సోదరుల విష‌యంపై కూడా ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు. వారే ధ‌ర్మాన కృష్ణ దాస్‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు. ఈ ఇద్ద‌రూ కూడా కాంగ్రెస్‌లోనే రాజకీయంగా ఎదిగారు. ముఖ్యంగా ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వైఎస్ హ‌యాంలో రెవెన్యూ మంత్రిగా కూడా ఉన్నారు. వివాద ర‌హితులుగా, దుందుడుకు స్వ‌భావం లేని వారిగా, విజ్ఞులుగా ఇద్ద‌రూ పేరు తెచ్చుకున్నారు. 

ధ‌ర్మాన కృష్ణ‌దాస్ శ్రీకాకుళం జిల్లా న‌ర‌స‌న్న పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడు సార్లు విజ‌యం సాధించారు. 2004, 2009, 2012 ఉప ఎన్నిక‌ల్లో కృష్ణ‌దాస్ విజ‌యం సాధించారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం ఆయ‌న ఓడిపోయారు. ఇక‌, 2012లో జ‌రిగిన వైసీపీ ఆవిర్భావ స‌మ‌యంలో కృష్ణ‌దాస్‌.. కాంగ్రెస్‌ను వీడి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ టికెట్పై పోటీ చేసి విజ‌యం సాదించారు. ఇక‌, మంత్రిగా ఉన్న ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు.. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు 2004, 2009 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. 2014 ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న కూడా కాంగ్రెస్‌కు బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. 

ఆ ఎన్నిక‌ల్లో కృష్ణ‌దాస్‌, ప్ర‌సాద‌రావులు ఇద్ద‌రూ కూడా వైసీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. అయితే, టీడీపీ హోరు, చంద్ర‌బా బు హ‌వా నేప‌థ్యంలొ ఇద్ద‌రూ కూడా ఓట‌మిపాల‌య్యారు. అయితే, ఇప్పుడు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇద్ద‌రు సోద‌రులు కూడా గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో కృషి చేశారు. ఆర్థికంగా బ‌లంగా ఉన్న నాయ‌కులు కావ‌డం, సానుభూతి ప‌వ‌నాలు , జ‌గ‌న్ మ్యానియా వంటివి బాగానే ప‌నిచేశాయి. ఇక‌, న‌ర‌స‌న్న పేట సిట్టింగ్ ఎమ్మెల్యే బ‌గ్గు ర‌మ‌ణ‌మూర్తిపై వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచాయి. టీడీపీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింద‌నే వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆయ‌న గెలుపు క‌ష్ట‌మ‌ని, ఈ ద‌ఫా కృష్ణ‌దాస్‌కే ప్ర‌జ‌లుమొగ్గు చూపార‌ని అంటున్నారు.

 అదేవిధంగా శ్రీకాకుళంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గుండ ల‌క్ష్మీదేవి కుటుంబానికి సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థాన‌మే ఉన్న‌ప్ప‌టీకి.. ఆమె అల్లుడు చ‌క్రం తిప్పుతున్నాడ‌ని, ప‌నులు కావ‌డం లేద‌ని అంటున్నారు ప్ర‌జ‌లు. ఇక‌, వ‌యో భారంతో ల‌క్ష్మీదేవి కూడా ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ నుంచి పోటీ చేసిన ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు ప్ర‌జ‌లు అండ‌గా నిలిచార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే ధ‌ర్మాన సోద‌రుల విజ‌యం ఖాయ‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: