ఆయ‌న‌కు వైఎస్ ఫ్యామిలీ అంటే ప్రాణం. రాజ‌కీయంగా త‌న‌కు గుర్తింపు ఇచ్చిన వైఎస్ అంటే అపార‌మైన ప్రేమ‌, అంత‌కు మించిన గౌర‌వం. ఒకే ఫ్యామిలీలో ఇద్ద‌రికి టికెట్లా? అంటూ పార్టీలోని సీనియ‌ర్లు పెద‌వి విరిచిన స‌మ‌యంలో నేనున్నానంటూ.. వైఎస్ క‌లుగ‌జేసుకుని త‌న‌కు టికెట్ ఇప్పించ‌డ‌మే కాకుండా రెండు సార్లు ప్ర‌చారం చేసి మ‌రీ త‌న గెలుపున‌కు కార‌ణ‌మ‌య్యార‌నే విశ్వాసం ఆయ‌న‌లో ఇప్ప‌టికీ తొంగి చూస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైఎస్ మ‌ర‌ణానంతరం త‌క్ష‌ణ‌మే ఆ కుటుంబానికి అండ‌గా నిలిచారు. ఎవ‌రు ఏమ‌న్నా.. ఏప‌రిస్థితి ఎలా వ‌చ్చినా తాను లెక్క చేయ‌బోన‌ని చెప్పారు. 

ఆయ‌నే శ్రీకాకుళం జిల్లా న‌ర‌స‌న్న‌పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా మూడు సార్లు విజ‌యం సాధించిన  ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌. రెవెన్యూ మంత్రిగా చ‌క్రం తిప్పిన ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు అన్న‌గా కంటే కూడా వైఎస్ అనుచ‌రుడిగానే కృష్ణ‌దాస్ చెప్పుకొంటారు. రాజ‌కీయంగా త‌న‌కు గుర్తింపు ల‌భించడానికి వైఎస్ కార‌ణ‌మ‌ని ఆయ‌న ఇప్ప‌టికీ విశ్వాసం ప్ర‌ద‌ర్శిస్తారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైఎస్ మ‌ర‌ణానంత‌రం , జ‌గ‌న్ స్తాపించిన పార్టీకి జై కొట్టారు. అంతేకాదు, అసలు కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి పార్టీ పెట్టాల‌ని చెప్పిన వారిలో ఈయ‌న కూడా ఉన్నార‌ని వైసీపీ నాయ‌కులు చెప్పుకొంటారు. 

శ్రీకాకుళం నుంచి గెలిచి, మంత్రి వ‌ర్గంలో ఉన్న ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వారిస్తున్నా కూడా లెక్క‌చేయ‌కుండా త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన కృష్ణ‌దాస్‌..వెంట‌నే వైసీపీలో చేరిపోయారు. ఆ వెంట‌నే జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. పార్టీలో విధేయుడుగా, ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత విశ్వాస పాత్రుడిగా మెలిగారు. 2014లో ఆయ‌న ఓడిపోయినా.. పార్టీని అభివృద్ది చేసేందుకు అనుక్ష‌ణం కృషి చేశారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను అన్నీతానై న‌డిపించారు. ఇలా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుని జ‌గ‌న్ ద‌గ్గ‌ర మంచి మార్కులు సంపాయించుకున్న కృష్ణ‌దాస్‌ను జ‌గ‌న్ కూడా అదే విధంగా చూడాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెబుతున్నారు. 

ఈ క్ర‌మంలోనే ఈ నెల 23 నాటి ఫ‌లితాల అనంత‌రం జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డితే.. కృష్ణ‌దాస్‌కు కీల‌క‌మైన ప‌ద‌వి ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని లోట‌స్ పాండ్ వ‌ర్గాలు అంటున్నాయి. కృష్ణ‌దాస్ వివాద‌ర‌హితుడు.. ఇంకా చెప్పాలంటే ధ‌ర్మాన‌కంటే కృష్ణ‌దాస్‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చేందుకే అటు జ‌గ‌న్ సుముఖంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. అదే టైంలో ఆయ‌న న‌ర‌స‌న్న‌పేట నుంచి ఇప్ప‌టికే వ‌రుస‌గా మూడుసార్లు గెలుపొంది హ్యాట్రిక్ కూడా కొట్టారు. పార్టీలో సీనియ‌ర్‌... గ‌తంలో కృష్ణ‌దాసు భార్య ప‌ద్మ‌ప్రియ వైసీపీ జిల్లా క‌న్వీన‌ర్‌గా కూడా ప‌నిచేశారు. ఇక జిల్లాలో చాలా మంది వైసీపీ నేత‌లు కూడా కృష్ణ‌దాస్‌కే స‌పోర్ట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అన్ని సమీక‌ర‌ణ‌లు క‌లిసి వ‌స్తే కృష్ణ‌దాస్‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కే యోగ్యం ద‌క్క‌ర్లోనే ఉంది. మ‌రి 23 ఫలితాల త‌ర్వాత ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: