అజ్ఞాతంలో ఉన్న టీవీ నైన్ మాజీ సీఈవో రవి ప్రకాశ్ హైదరాబాద్ పోలీసులకు ఈ మెయిల్ పంపినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పలుసార్లు నోటీసులు పంపినా విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. అరెస్టును తప్పించుకునేందుకు కోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. 


అందుకే ఆయన తాను విచారణకు హాజరయ్యేందుకు మరో పది రోజులు పాటు గడువు కావాలని కోరుతూ ఈ మెయిల్ చేసినట్టు తెలుస్తోంది. తాను వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేనని రవిప్రకాశ్‌ ఈ మెయిల్‌లో తెలిపారట. అయితే రవిప్రకాశ్ తోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివాజీ కూడా పోలీసులకు ఈ మెయిల్ చేశారట.

తనకు ఆరోగ్యం సరిగా లేదని శివాజీ మెయిల్‌ పంపించారట. అయితే వీటిని హైదరాబాద్ పోలీసులు అరెస్టును తప్పించుకునేందుకు పన్నిన ఎత్తుగడలుగానే చూస్తున్నారట. కాకపోతే వీరిద్దరూ హైదరాబాద్ వదిలి వెళ్లిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే తలదాచుకునే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. 

రవిప్రకాశ్, శివాజీ ఇద్దరూ విజయవాడలోనే ఉన్నట్టు తెలుగుదిన పత్రిక సాక్షి ఓ కథనంలో తెలిపింది. వీరిద్దరూ ఏపీలో తలదాచుకున్నారన్న సమాచారం పోలీసుల వద్ద కూడా ఉందట.  వీరిద్దరిని అదుపులోకి తీసుకోవడంపై పోలీసులు దృష్టి సారించారట. కాకపోతే ఏపీ సర్కారు సహకరించే అవకాశం లేనందువల్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై మథనపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: