ఇప్పటికే ఫోర్జరీ, నిధుల మళ్లింపు వంటి ఆరోపణలతో కేసులు ఎదుర్కొంటూ అజ్ఞాతంలో ఉన్న టీవీ నైన్ మాజీ సీఈవో రవి ప్రకాశ్ నెత్తిన ఇప్పుడు మరో పిడుగు పడింది. ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది. టీవీ9 సీఈవోగా ఉన్న సమయంలో తన సొంత ఛానల్ మోజోకు టీవీ9 లోగోను అమ్మేశారట. 


దీనికి సంబంధించిన ఆధారాలు సంపాదించిన కొత్త యాజమాన్యం రవిప్రకాశ్ పై తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. టీవీ9 తెలుగు లోగోతో పాటు మొత్తం ఆరు లోగోలను ఆయన సొంత వెబ్‌చానల్‌ మోజోటీవీకి దొంగచాటుగా బదిలీ చేశారని ఆరోపిస్తూ ఏబీసీపీఎల్‌ డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. 

ఐపీసీ 457, 420, 409, 406, 20(బి) సెక్షన్ల కింద రవిప్రకాష్ పై కేసులు నమోదు చేశారు.  రవిప్రకాశ్‌, ఎంవీకేఎన్‌ మూర్తి, హరికిరణ్‌ చేరెడ్డి కలిసి టీవీ9 లోగోలను మోజోటీవీ యాజమాన్య సంస్థ మీడియా నెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేవలం రూ.99 వేలకు అమ్మేసినట్టు తెలుస్తోంది. 2018 మే 22న కుదిరిన మౌఖిక ఒప్పందం మేరకు వీటిని అమ్ముతున్నామంటూ 2018 డిసెంబరు 31న డీడ్‌ ద్వారా వాటిని రాసిచ్చేశారు.

లోగోలు అమ్మినందుకు టీవీ9 యాజమాన్య సంస్థ ఏబీసీపీఎల్‌కు డబ్బులు అందాలి. అందుకు సాక్ష్యంగా 2019 జనవరి 22న 99,000 రూపాయలను నెక్ట్స్‌ ఇండియా నుంచి ఏబీసీపీఎల్‌కు బదిలీ చేశారు. కోట్ల రూపాయల విలువచేసే లోగోలను అక్రమంగా, దురుద్దేశపూర్వకంగా, కంపెనీ వాటాదారులకు నష్టం కలిగించే విధంగా రవిప్రకాశ్‌ బదిలీ చేశారని కౌశిక్‌రావు ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న రవిప్రకాశ్ అరాచకాలు చూస్తుంటే మెరుగైన సమాజం ఇదేనా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: