తూర్పుగోదావ‌రి జిల్లాలో టీడీపీకి కంచుకోట‌గా ఉన్న మండ‌పేడ నియోజ‌క‌వ‌ర్గం మ‌రోసారి ఆ పార్టీ కంచుకోట‌గానే ఉంది. ఇక్క‌డ నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావు వ‌రుస‌గా మూడోసారి విజ‌యం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. 2009, 2014 ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో గెలిచిన ఆయ‌న ఈ ఎన్నిక‌ల్లో గెలుపుతో వ‌రుస‌గా మూడో గెలుపు సాధించిన‌ట్ల‌య్యింది. వైసీపీ ఈ ఎన్నిక‌ల్లో సోష‌ల్ అస్త్రం అంటూ రామ‌చంద్రాపురంకు చెందిన మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌ను ఇక్క‌డ రంగంలోకి దింపినా బోస్ వేగుళ్ల‌పై ఓడిపోయారు.


తూర్పుగోదావ‌రి జిల్లాలో ఈ ద‌ఫా భారీ ఎత్తున ఈ నియోజ‌క‌వ‌ర్గం వార్త‌ల్లో నిలిచింది.మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఇక్క‌డ నుంచి అనూహ్య‌రీతిలో పోటీకి దిగారు. ఆది నుంచి కూడా ఇక్క‌డ పోరు ఉదృతంగానే సాగింది. గ‌త‌ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా జోగేశ్వ‌ర‌రావు ఊహించ‌ని రీతిలో ఆ ఎన్నిక‌ల్లో 36 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ తెచ్చుకున్నారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు వ‌ద్ద కూడా మంచి మార్కులు సంపాయించుకున్నారు. తాజా ఎన్నిక‌ల్లో ఊహించ‌ని విధంగా జ‌గ‌న్ త‌న పార్టీ త‌ర‌ఫున మాజీ మంత్రి, వైఎస్‌విధేయుడిగా పేరు తెచ్చుకున్న పిల్లికి ఛాన్స్ ఇచ్చారు. 


ఆది నుంచి కూడా పిల్లి సౌమ్యుడిగా పేరు తెచ్చుకోవ‌డం, వివాద ర‌హితుడు కావ‌డంతో ఆయ‌న‌పై పార్టీలోనూ, అనుచ‌రు ల్లోనూ ఆశ‌లు పెరిగాయి. ఇక, ప్ర‌చారంలోనూ పిల్లి దూసుకుపోయారు. జ‌గ‌న్ మ్యానియాపైనా ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక‌, సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వ‌ర‌రావు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, త‌న మంచి త‌నంతో ఇక్క‌డ మ‌రోసారి పాగా వేసేందుకు క‌ష్ట‌ప‌డ్డారు. ఇక‌, మూడో పార్టీ జ‌న‌సేన నుంచి ఇక్క‌డ వేగుళ్ల లీలా కృష్ణ పోటీ చేశారు. సామాజిక స‌మీక‌ర‌ణ‌, ప‌వ‌న్ మ్యానియా త‌న‌ను గెలిపిస్తాయ‌ని ఆశించారు. దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో త్రిముఖ పోటీ నెల‌కొన‌డంతో ఎవ‌రు గెలుస్తార‌నే ఉత్కంఠ పీక్ పొజిష‌న్‌కు చేరింది. జ‌న‌సేన‌, టీడీపీ అభ్య‌ర్థులు క‌మ్మ వ‌ర్గానికి చెందిన వారు కావ‌డంతో బోస్ గెలుపుపై వైసీపీ ఆశ‌లు పెట్టుకున్నా అవి నెర‌వేర‌లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: