వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ సునామీలో టీడీపీ, జ‌న‌సేన ఫ్యామిలీ ప్యాకేజీలు కొట్టుకుపోయాయి. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీలో ఒకే ఫ్యామిలీ నుంచి ప‌లువురు నేత‌లు టిక్కెట్లు ద‌క్కించుకుని పోటీ చేశారు. వీరంతా జ‌గ‌న్ సునామీ దెబ్బ‌తో చిత్తు చిత్త‌య్యారు. రాయలసీమలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరి టికెట్లు దక్కించుకుంటే వారికి ఘోర పరాజయం తప్పలేదు. కోట్ల క‌ర్నూలు ఎంపీగాను, ఆయ‌న భార్య సుజాత‌మ్మ ఆలూరు ఎమ్మెల్యేగాను పోటీ చేసి ఓడిపోయారు.


ఇక అదే జిల్లాలోని డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణ‌మూర్తి ఫ్యామిలీలో ఆయ‌న త‌న‌యుడు కేఈ.శ్యాంబాబు ప‌త్తికొండ‌లోనూ, సోద‌రుడు కేఈ.ప్ర‌తాప్ డోన్‌లోనూ చిత్తుగా ఓడిపోయారు. ఇక అదే క‌ర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన దివంగ‌త భూమా కుమార్తె అఖిల‌ప్రియ ఆళ్ల‌గ‌డ్డ‌లోనూ, ఆమె సోద‌రుడు, నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించిన భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఘోరంగా ఓడిపోయారు.


ఇక జ‌న‌సేన ఫ్యామిలీ ప్యాక్‌ల విష‌యానికి వ‌స్తే అదే క‌ర్నూలు జిల్లాలో నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి జనసేన తరఫున నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి.. ఆయన అల్లుడు, కుమార్తెలు నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లె శాసనసభ స్థానాల నుంచి పోటీ చేశారు. పోలింగ్‌ అయ్యాక ఎస్పీవై రెడ్డి మరణించారు. కానీ.. ఆ ఫ్యామిలీ మొత్తం ఓడింది. ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఫ్యామిలీ ప్యాక్ విష‌యానికి వ‌స్తే ప‌వ‌న్ తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడారు. భీమ‌వ‌రం, గాజువాక‌లో వైసీపీ అభ్య‌ర్థులు ఓడారు. ఇక ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు న‌ర‌సాపురం ఎంపీ సీటులో ఓడిపోయారు.


ఇక అనంత జిల్లాలో జేసీ సోద‌రులు వార‌సుడు జేసీ ప‌వ‌న్ అనంత ఎంపీగాను, జేసీ అస్మిత్‌రెడ్డి తాడిప‌త్రిఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఇక సినీ నటుడు బాలకృష్ణ పెద్ద అల్లుడు నారా లోకేష్‌ మంగళగిరి నుంచి.. చిన్న అల్లుడు భరత్‌ విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. బాల‌య్య మాత్రం హిందూపురంలో విజ‌యం సాధించారు. నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరిలో బొల్లినేని రామారావు, ఆత్మ‌కూరులో ఆయ‌న సోద‌రుడు కృష్ణ‌య్య ఓడారు. 


ఇక మంత్రి గంటా శ్రీనివాస్ గెలిస్తే ఆయ‌న వియ్యంకుడు, మ‌రో మంత్రి పి.నారాయ‌ణ ఓడారు. ఇక గంటా మ‌రో వియ్యంకుడు అంజిబాబు భీమ‌వ‌రంలో ఓడారు. విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన అశోక్‌ గజపతిరాజు, విజయనగరం శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కుమార్తె అథితి ఓడిపోయారు. ఇక గుంటూరు జిల్లాలో వియ్యంకులు అయిన జీవీ.ఆంజ‌నేయులు వినుకొండ‌లో, ఆయ‌న వియ్యంకుడు కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్ పెద‌కూర‌పాడులో ఓడిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: