ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు చూస్తే జ‌న‌సేన‌కు గింగ‌రాలు తిప్పేసేలా ఉన్నాయ్‌. మార్పు కోసం ప్ర‌శ్నిస్తా అంటూ అధికారంలోకి వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా టీడీపీ, ఎన్డీయే కూట‌మికి స‌పోర్ట్ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దిగిన ప‌వ‌న్ ఎన్నిక‌ల‌కు ముందే చేతులు ఎత్తేశాడు. ఇదంతా టీడీపీకి ల‌బ్ధి చేయ‌డానికే అన్న విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయ్‌. స‌రే ఏదెలా ఉన్నా జ‌న‌సేన ఏపీలోని 136 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసి మిగిలిన సీట్ల‌లో కొన్నింటిని క‌మ్యూనిస్టుల‌కు, మ‌రికొన్నింటిని బీఎస్పీకి ఇచ్చింది. తీరా గురువారం వెలువ‌డిన ఫలితాలను చూసి పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌తో పాటు ఆ పార్టీ నేతలు సైతం అవాక్కయ్యారు. 


రాష్ట్రం మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల్లో 3.13 కోట్ల ఓట్లు పోలైతే, జనసేనకు దక్కిన ఓట్లు కేవలం 21 లక్షలు మాత్రమే. ఉభయ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో పార్టీ పోటీచేసిన చాలా నియోజకవర్గాల్లో జనసేనకు దక్కిన ఓట్ల కంటే నోటాకు వచ్చిన ఓట్లే అధికంగా ఉన్నాయి. ఇక ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన ఎఫెక్ట్ టీడీపీపై మామూలుగా లేదు. గోదావ‌రి జిల్లాల త‌ర్వాత ప‌వ‌న్ ఎక్కువుగా ఆశ‌లు పెట్టుకున్న ఉత్త‌రాంధ్ర‌లోనూ ఆ పార్టీ ఘోరంగా దెబ్బ‌తింది.


కొన్ని చోట్ల నోటా కంటే ఆ పార్టీ అభ్య‌ర్థుల‌కు వ‌చ్చిన ఓట్లు త‌క్కువుగా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, నరసన్నపేట, విజయనగరం జిల్లా సాలూరు, గజపతినగరం, విశాఖ జిల్లాలోని మాడుగుల, పాడేరు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎదురైంది. పాడేరులో జనసేన పార్టీ కంటే స్వతంత్ర అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక వీట‌న్నింటి కంటే ఘోరంగా ప‌వ‌న్ తాను పోటీ చేసిన గాజువాక‌, భీమ‌వ‌రం రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఓడిపోయారు. గాజువాక‌లో మ‌రీ దారుణంగా మూడో స్థానంతో స‌రిపెట్టుకున్నారు.


ఇక ప్ర‌జారాజ్యంతో పోలిస్తే జ‌న‌సేన దారుణంగా పెర్పామ్ చేసింది. ప్ర‌జారాజ్యం ఏపీలోని 13 జిల్లాల్లోని 16 నియోజకవర్గాల్లో గెలిచి, మరో 34 నియోజకవర్గాల్లో రెండో స్థానం దక్కించుకోగా.. జనసేన తూర్పు గోదావరి జిల్లాలోని ఒక్క రాజోలులో గెలుపొందగా కేవలం మూడంటే మూడు చోట్లే రెండో స్థానంలో నిలిచింది. అవి గాజువాక, భీమవరంతో పాటు నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: