తాజా ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీపై ఆయన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాజకీయ వర్గాలు సైతం జనసేన మరీ కాకపోయినా ఓ మోస్త‌రు సంచలనాలు అయినా  క్రియేట్ చేస్తుందని ఆశించారు. పవన్ ఖచ్చితంగా అసెంబ్లీలోకి అడుగుపెడతారని మెజార్టీ సర్వేలు సైతం స్పష్టం చేశాయి. రాజకీయ మేధావులు, మీడియా విశ్లేషకులు సైతం పవన్ తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీ మెట్లు ఎక్క‌బోతున్నాడని అంచనా వేశారు. తీరా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక చూస్తే అందరి అంచనాలు జనసేనని పూర్తిగా తలకిందులు చేసేశారు. జనసేన అధికారంలోకి వస్తుందన్న ఆశ ఎవరికి లేకపోయినా కనీసం ఆరేడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఒకటి రెండు ఎంపీ సీట్లు ఖ‌చ్చితంగా గెలుస్తుంది అని అందరూ భావించారు. 


ఇదిలా ఉంటే పార్టీ అధినేత పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాద్ ఒక్కరు మాత్రమే అతి స్వల్ప తేడాతో విజయం సాధించడంతో జనసేనకు ఏపీ అసెంబ్లీలో కనీసం ప్రాధినిత్యం దక్కిందన్న గౌరవం ఒక్కటే మిగిలింది. పవన్ సొంత జిల్లా భీమవరంలో ఎలా ఉన్నా గాజువాకలో తప్పకుండా గెలుస్తాడని పవన్ కు 30 వేలకు తక్కువ కాకుండా మెజారిటీ వస్తుందని ముందు నుంచే ప్రచారం జరిగింది. అలాంటి గాజువాకలో పవన్ ఘోరంగా ఓడిపోయారు. ఇక్కడ పవన్ ఓటమికి దారితీసిన అంశాలను పరిశీలిస్తే చాలా లోపాలు పవన్ ను ఓడించాయ‌న్న విష‌యం స్పష్టంగా తెలుస్తోంది. గాజువాకలో పవన్ పోటీ చేస్తుండడంతో అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు ప్రధాన పార్టీలు ప్రచారం చేసిన జనసేన ప్రచారం మాత్రం చాలా స్త‌బ్దుగా ఉంది. 


ఇక్కడ పోటీ చేస్తున్నట్టు ప్రకటించినప్పుడు జనసేన సైనికులలో ఉన్న ఉత్సాహం ఎన్నికల రోజు నాటికి లేకుండా పోయింది. ప్రధానంగా ఇక్కడ ఉన్న జన సైనికులను ఒక తాటి మీదకు తీసుకువచ్చే సమర్ధుడైన నాయకులు కూడా లేకుండా పోయారు. దీనికి తోడు గతంలో  ప్రజారాజ్యం నుంచి గాజువాకలో విజయం సాధించడంతో పాటు ఇక్కడ పోటీ చేసేందుకు రెండేళ్లుగా గ్రౌండ్ వర్క్ చేసుకున్న మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యకు ఆఖరి నిమిషంలో పెందుర్తి నియోజకవర్గం కేటాయించారు. దీంతో ఆయన కేడర్ అంతా అక్క‌డ‌ కాన్సన్ట్రేషన్ చేయడంతో ఆ ఎఫెక్ట్‌ పవన్ పై గట్టిగా పడింది. ఇక ఇదే నియోజకవర్గానికి చెందిన మరో సీనియర్ నేత కోన తాతారావుకు విశాఖ తూర్పు నియోజక వర్గాన్ని కేటాయించారు ఆయన వర్గం కూడా తూర్పు నియోజకవర్గంలో తాతారావు కోసం పని చేసి గాజువాకను నిర్లక్ష్యం చేయడం కూడా మైనస్ అయింది. పవన్ నామినేషన్ వేసిన తర్వాత ఆయన తరపున ప్రచారం చేసేందుకు సరైన నాయకులు లేకపోవడంతో పవన్ అభిమానులు సొంత ఖర్చులతో వీరికి తిరిగి ప్రచారం చేయాల్సిన దుస్థితి వచ్చేసింది. 


పవన్ స్థానికేతురుడు కావడంతో  ఆయన ఇక్కడ గెలిచిన భీమవరం ఉంచుకొని గాజువాకలో రాజీనామా చేస్తాడు అని వైసీపీ చేసిన ప్రచారం కూడా ఆయనకు మైనస్ అయింది. అలాగే టిడిపితో పవన్ కుమ్మక్కయ్యారని టాక్‌ కూడా పవన్ ను నిండా ముంచింది. గాజువాకలో మొత్తంగా పవన్ మూడు సభలు మాత్రమే నిర్వహించారు. నియోజకవర్గంలో ఉన్న 307 పోలింగ్ బూత్‌లలో చాలా చోట్ల జనసేనకు ఏజెంట్లను కూడా చూసే పరిస్థితి వచ్చింది.  ఎన్నికలకు ముందు ఇక్కడ కార్యకర్తలకు,  పవన్ అభిమానులకు ఇచ్చిన కొంత డబ్బును వారు స్వాహ చేయడంతో చివరిలో ఓట్లు కొనుగోలు చేసేందుకు జనసేన అధిష్టానం వాళ్లను నమ్ముకొని పైసలు లేకపోవటం కూడా కొంతవరకు మైనస్ అయింది. 


ఇక్కడ పవన్ తరపున కొంతమంది విశ్రాంత ఐఏఎస్ అధికారులు ప్రచారం చేశారు తప్ప ఓట‌ర్ల‌ను ఆకట్టుకునేందుకు సమర్థులైన నేతలు కూడా ఆ పార్టీ నుంచి లేకపోవడంతో పవన్ ఇక్కడ స్థానిక కేడర్ ను నమ్ముకుని నిండా మునిగిపోయాడు. జనసేన తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసిన జేడి మాత్రమే గాజువాకలో కాస్తోకూస్తో పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టిన మాట వాస్తవం. అయితే ఆయన కూడా విశాఖ లోక్ సభ సీటుని అంతా కవర్ చేసుకోవాల్సి ఉండడంతో ఆయన ఎఫెక్ట్ ఇక్కడ అంత పని చేయలేదు. ఏదేమైనా  సరైన ప్లానింగ్ లేకపోవడంతో పాటు పవన్ ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే గాజువాకలో ఆయన ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: