చేసుకున్నవాడికి చేసుకున్నంత అన్న సామెత మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన విషయంలో అక్షరాలా సరిపోతుంది. తెలుగుదేశం పార్టీ నుంచి మూడు సార్లు అసెంబ్లీకి పోటీ చేసిన ఆమె మూడు సార్లు ఘోరంగా ఓడిపోయింది. అదే వైసీపీ నుంచి ఒకసారి పోటీ చేసిన కల్పన ఆ ఒక్క సారి విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీతో ఉప్పులేటి కల్పన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 2004 ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో రద్దయిన అసెంబ్లీ నియోజకవర్గం నిడుమోలు నుంచి తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసిన కల్పన ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి పాటూరి రామయ్య చేతిలో తొలిసారిగా ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజనలో టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పుట్టిన గడ్డ ఉన్న పామర్రు రిజ‌ర్వ్‌డ్‌గా మారడంతో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కల్పన కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో వరుసగా రెండోసారి ఓడిపోయారు. 


2009లో కృష్ణా జిల్లాలో టీడీపీ గాలులు బలంగా వీచినా కూడా ఉప్పులేటి కల్పన పై డీవై. దాస్ ఏకంగా 13 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.  రెండు సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుని విఫ‌లమైన కల్పన గత 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసిపిలోకి జంప్ చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్య పై 700 ఓట్ల తేడాతో విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. వైఎస్. జగన్ దయతో 15 సంవత్సరాల ఆమె సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. అయితే అత్యాశకు పోయిన కల్పన టిడిపి ప్రలోభాలకు లొంగిపోయి ఎమ్మెల్యేగా గెలిచిన కొద్దిరోజులకే టిడిపి గూటికి చేరిపోయారు. వైసీపీ నుంచి గెలిచిన కల్పన టిడిపిలో చేరిన కొద్ది రోజులకే నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకున్నారు. 


తాజా ఎన్నికల్లో కల్పన తిరిగి టిడిపి అభ్యర్థిగా పోటీ చేయగా ఆమెపై వైసీపీ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ ఏకంగా 30 వేల ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. వరుస‌గా టిడిపి నుంచి మూడుసార్లు ఓడినా కల్పన వైసీపీ నుంచి మాత్రమే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో కూడా ఆమె వైసీపీ నుంచి పోటీ చేసి ఉంటే పామర్రులో రెండో సారి ఎమ్మెల్యేగా గెలవడంతోపాటు.... మంత్రి పదవి రేసులో కూడా ఉండేవారు. ఏదేమైనా కల్పన అనాలోచిత నిర్ణయాలతో తన రాజకీయ భవిష్యత్తుకు సమాధి కట్టుకున్నట్లు అయింది. ఆమె అటు చంద్ర‌బాబును న‌మ్ముకోవ‌డంతో ఆయ‌న క‌ల్ప‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తును క్లోజ్ చేసేశారు. అదే రోజా క‌ల్ప‌న‌తో పాటు 2004, 2009 ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి ఓడినా ఆ త‌ర్వాత వైసీపీలోకి వెళ్లారు. 2014లో వైసీపీ నుంచి గెలిచి తాజా ఎన్నిక‌ల్లో మ‌రోసారి గెలిచి ఇప్పుడు మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: