రాజ‌కీయ మేథావి, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ ఏపీలో వైసీపీ అధికారంలోకి రావ‌డంతో మ‌ళ్లీ పొలిటిక‌ల్ తెర‌మీద‌కు వ‌చ్చేస్తున్నారు. దివంగ‌త వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉండ‌వ‌ల్లికి రాజ‌కీయంగా ఎంతో లైఫ్ ఇచ్చారు. రాజ‌మండ్రి నుంచి రెండుసార్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన ఉండ‌వ‌ల్లికి 2004లో ఎంపీ సీటు ద‌క్కేలా చేయ‌డంలో వైఎస్ ఎంతో కృషి చేశారు. ఆ త‌ర్వాత 2009లో రెండోసారి ఎంపీగా పోటీ చేసిన‌ప్పుడు ఆయ‌న ఖ‌చ్చితంగా ఓడిపోతార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ వైఎస్ చ‌క్రం తిప్పి ఆ లోక్‌స‌భ సీటు ప‌రిధిలో ఉన్న అన‌ప‌ర్తి నుంచి భారీ మెజార్టీ ర‌ప్పించేలా చేసి ఉండ‌వ‌ల్లిని రెండోసారి లోక్‌స‌భ‌కు పంపేలా చేయ‌డంలో ఎంతో కృషి చేశారు.


దివంగ‌త వైఎస్‌కు ఉండ‌వ‌ల్లికి మ‌ధ్య ఎంతో సాన్నిహిత్య సంబంధం ఉండేది. ఆ త‌ర్వాత ఉండ‌వ‌ల్లి వైఎస్ త‌న‌యుడు వైఎస్‌.జ‌గ‌న్ పెట్టిన వైసీపీలోకి వెళ్ల‌క‌పోయినా జ‌గ‌న్‌కు ఎప్పుడూ విలువైన స‌ల‌హాలు అందిస్తూనే వ‌స్తున్నారు. అలాగే జ‌గ‌న్ చేసిన త‌ప్పుల‌ను కూడా ఎత్తి చూపుతూ వ‌స్తున్నారు. ఐదేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో అమ‌రావ‌తి, పోల‌వ‌రం అవినీతిపై ఎప్ప‌టిక‌ప్పుడు గ‌ళం ఎత్తుతోన్న ఉండ‌వ‌ల్లి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన సంద‌ర్భంగా ప‌లు సూచ‌న‌లు చేశారు. 


ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 2014 నుంచి రాజ‌కీయంగా స‌న్యాసం తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించిన ఉండ‌వ‌ల్లి తాను మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి రాన‌ని కూడా ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. ఐదేళ్ల చంద్ర‌బాబు ప్ర‌భుత్వ పాల‌న‌లో ఎన్నో అంశాల‌పై విమ‌ర్శ‌లు చేసి ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టిన ఆయ‌న స‌ల‌హాల‌ను ఇప్పుడు వైసీపీ వాడుకోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఉండ‌వ‌ల్లిని ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా పెట్టుకోవాల‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం.


ఉండ‌వ‌ల్లి లాంటి మేథావుల స‌ల‌హాలు ఉంటే ప్ర‌భుత్వంలో ఎక్క‌డెక్క‌డ లోపాలు ఉన్నాయో తెలుసుకుని.. ఆ లోపాల‌ను స‌రిదిద్దుకునేందుకు ఛాన్స్ ఉంటుంద‌న్న‌దే జ‌గ‌న్ ఆలోచ‌న‌. ఈ క్ర‌మంలోనే ఉండ‌వ‌ల్లిని ఒప్పించేందుకు విజ‌య‌సాయిరెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు లాంటి సీనియ‌ర్ల‌ను ఒక‌టి రెండు రోజుల్లోనే ఉండ‌వ‌ల్లి ద‌గ్గ‌ర‌కు మ‌ధ్య‌వ‌ర్తులుగా పంప‌నున్న‌ట్టు తెలుస్తోంది. 


అయితే ఉండ‌వ‌ల్లి మ‌ళ్లీ రాజ‌కీయంగా తెర‌మీద‌కు వ‌చ్చే ఉద్దేశం లేద‌ని ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా ప్ర‌భుత్వ స‌ల‌హాదారునిగా ఉండాల‌ని ఉండ‌వ‌ల్లిని కోర‌తారా ?  లేదా ? ఆయ‌న్ను పార్టీలోకి కూడా తీసుకుని ఆయ‌న సేవ‌లు వాడుకుంటారా ? అన్న‌ది కూడా ?  చూడాలి. ఉండ‌వ‌ల్లి రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉండాలి ? ప‌్ర‌తిప‌క్షాలు ప్ర‌భుత్వంపై చేసే విమ‌ర్శ‌ల‌ను పాయింట్ టు పాయింట్‌తో తిప్పికొట్టాల‌ని అనుకుంటే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తార‌ని అంటున్నారు. ఒక వేళ ఆయ‌న సేవ‌లు కేంద్రంలో అస‌వ‌రం అనుకుంటే రాజ్య‌స‌భ‌కు కూడా పంపే ఆలోచ‌న జ‌గ‌న్‌కు ఉంద‌ని స‌మాచారం. మ‌రి ఉండ‌వ‌ల్లి పార్టీలోకి వెళ్ల‌కుండా కేవ‌లం ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగానే ఉంటారా ?  లేదా ? అన్న‌ది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: