ఏపీ సీఎం వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి త‌న కేబినెట్‌ను ఈ నెల 8వ తేదీన ఏర్పాటు చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. 151 మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకుని తిరుగులేని మెజార్టీతో ఏపీ సీఎంగా ఇప్ప‌టికే ప్ర‌మాణ‌స్వీకారం చేసిన జ‌గ‌న్ ఈ నెల 7న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల స‌మావేశాన్ని తాడేప‌ల్లిలో ఏర్పాటు చేశారు. ఆ మ‌రుస‌టి రోజే కేబినెట్ మంత్రుల స‌మావేశం ఉంటుంది. అంటే 7వ తేదీనే ఎవ‌రెవ‌రు జ‌గ‌న్ కేబినెట్లో మంత్రులుగా ఉంటార‌న్న విష‌యంలో ఓ క్లారిటీ వ‌చ్చేస్తుంది. జ‌గ‌న్ తొలి విడ‌త‌లో 13 జిల్లాల నుంచి 15 మంది మంత్రుల‌ను త‌న కేబినెట్లోకి తీసుకుంటార‌ని.. ఆ త‌ర్వాత ఒక‌టి, రెండు నెల‌లు ఆగి మిగిలిన మంత్రుల‌తో పూర్తి కేబినెట్‌ను ఏర్పాటు చేస్తార‌ని అంటున్నారు.


ఇక సీఎం త‌ర్వాత అత్యంత కీల‌క‌మైన డిప్యూటీ సీఎం పోస్టులు జ‌గ‌న్ ఎవ‌రెవ‌రికి ఇస్తారు ? అన్న‌ది ఇప్పుడు పెద్ద స‌స్పెన్స్‌గా మారింది. గ‌త ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు సీఎంగా ఉంటే కాపు, బీసీ సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన వారికి రెండు పోస్టులు డిప్యూటీ సీఎంలుగా ఇచ్చారు. కాపు వ‌ర్గం నుంచి హోం మంత్రిగా ఉన్న నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌తో పాటు , బీసీ కోటాలో రెవెన్యూ శాఖా మంత్రిగా ఉన్న కేఈ.కృష్ణ‌మూర్తికి కూడా డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు.


ఇక ఇప్పుడు జ‌గ‌న్ కూడా కేబినెట్ కూర్పులో సామాజిక‌, ప్రాంతీయ స‌మ‌తుల్య‌త‌ను పాటించాలి. చంద్ర‌బాబు త‌న కేబినెట్‌లో రెండు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వుల‌ను ఒక‌టి కోస్తాకు, మ‌రొక‌టి సీమ‌కు కేటాయించారు. ఇక ఇప్పుడు జ‌గ‌న్ కూడా ఒక ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విని కాపుల‌కు, మ‌రొక‌టి బీసీల‌కు ఇస్తార‌ని అంటున్నారు. కాపుల‌ను సంతృప్తి ప‌రిచే క్ర‌మంలో ఆ వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నేత, గుంటూరు జిల్లాకు చెందిన ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లుకు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని అంటున్నారు. ఉమ్మారెడ్డి ఇప్ప‌టికే ఎమ్మెల్సీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.


ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు అల్లుడు కిలారు వెంక‌ట‌రోశ‌య్య ఈ ఎన్నిక‌ల్లో పోన్నూరు నుంచి పోటీ చేసి టీడీపీ సీనియ‌ర్ నేత ధూళిపాళ్ల న‌రేంద్ర‌కుమార్‌ను ఓడించిన సంగ‌తి తెలిసిందే. ఇక బీసీ కోటాలో గ‌తంలో మంత్రులుగా ప‌నిచేసిన బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పేర్లు వినిపిస్తున్నాయ‌ట‌. వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రికి డిప్యూటీ సీఎం ఇస్తే అనుభ‌వం ప‌రంగా బాగుంటుంద‌న్న అభిప్రాయం కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నా... వీరిద్ద‌రి కంటే క్లీన్ ఇమేజ్ ఉన్న బీసీ వ్య‌క్తుల‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం మ‌రికొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: