నమ్ముకున్న వారిని ఆదరించడంలో వైఎస్‌ కుటుంబం తర్వాతే ఎవరైనా అని నిరూపించాడు ఏపీ న‌వ‌యువ ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి. న‌మ్మ‌కున్నోడి కోసం ఎంత‌కైనా వెళ‌తామ‌ని.. ఏదైనా చేస్తామ‌ని దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి గ‌తంలో ఎన్నోసార్లు ఫ్రూవ్ చేసుకున్నారు. వైఎస్ అంటే న‌మ్మ‌కానికి కేరాఫ్‌గా నిలిచారు. ఆయ‌న ద‌య‌తో ఎంతోమంది ద్వితీయ శ్రేణి లీడ‌ర్లు ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదు ఏకంగా మంత్రులు కూడా అయ్యారు. 


ఇక ఇప్పుడు న‌మ్మ‌కున్నోళ్ల‌కు న్యాయం చేయ‌డంలో నాన్న బాట‌లోనే న‌డిచి తండ్రిని మించిన త‌న‌యుడిగా దూసుకు వెళుతున్నారు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి. సీఎం కార్యాలయంలో స్పెషలాఫీసర్‌గా చిన్న పిల్లల వైద్యుడు హరికృష్ణ నియ‌మితులు అయ్యారు. అనంత‌పురం జిల్లా పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని మండ‌ల కేంద్ర‌మైన కొత్త‌చెరువులో డాక్ట‌ర్ హ‌రికృష్ణ చిన్న‌పిల్ల‌ల క్లీనిక్‌ను స్థాపించారు. వైద్య వృత్తిలో ఆయ‌న ఎంతో పేరు ప్ర‌ఖ్యాతులు సాధించారు.


ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైఎస్ కుటుంబంపై ఉన్న అనంతాభిమానంతో వారి వెంట నడిచారు. జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల చేప‌ట్టిన పాద‌యాత్ర‌తో పాటు జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో కూడా వారి వెంటే న‌డిచారు. షర్మిల పాదయాత్రలో 3,112 కిలో మీటర్లు, వైఎస్‌ జగన్‌తో 3,648 కిలోమీటర్లు వారి వెంట నడిచారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ అడుగు జాడ‌ల్లోనే న‌డుస్తూ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు ఇచ్చే ప్ర‌తి విన‌తిని స్వీక‌రిస్తూ వాటిని భ‌ద్ర‌ప‌రిచేవారు. 


అలాగే జ‌గ‌న్ ఆదేశాల‌తో హ‌రికృష్ణ ఎంతోమందికి వైద్యం అందించి జ‌గ‌న్ మ‌న్న‌న‌లు పొందారు. పాద‌యాత్ర‌లో ప్ర‌తినిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండ‌డంతో పాటు ప్ర‌జ‌ల్లో ఉన్న ఫీడ్‌బ్యాక్‌ను జ‌గ‌న్‌కు ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేస్తూ ఉండేవారు. ష‌ర్మిల పాద‌యాత్ర‌లో కాని.. ఇటు జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో కాని హ‌రికృష్ణ ప‌డిన క‌ష్టాన్ని జ‌గ‌న్ గుర్తుంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే తాను సీఎం అయిన వెంట‌నే  ముఖ్యమంత్రి కార్యాలయం స్పెషలాఫీసర్‌గా నియమించడంతో నమ్ముకున్న వారికి వైఎస్‌ కుటుంబం అండగా నిలుస్తుందని పలువురు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: