ఈ సంవత్సరం తెలంగాణలో జరిగి ఏ ఎన్నిక అయినా సరే అధికార పార్టీ టీఆర్ఎస్ విజయ దుందుభి మోగిస్తున్న విషయం తెలిసిందే.  అసెంబ్లీ ఎన్నికల నుంచి మొన్న జరిగిన స్థానిక ఎన్నికల వరకు టీఆర్ఎస్ అత్యధిక సీట్లు కైవసం చేసుకుంటు వచ్చింది.  అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాకూటమి’ తరుపు నుంచి గెలిచిన అభ్యర్థులు వరుస బెట్టి టీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు.  అంతే కాదు సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తున్నట్టుగా ఆ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు  స్పీకర్‌కు లేఖ ఇవ్వడంపై  సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నిరసనకు దిగారు.  


పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిబంధనలకు విరుద్ధంగా టీఆర్ఎస్ కలిపేసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపిస్తూ, భట్టి విక్రమార్క తలపెట్టిన ఆమరణ దీక్షను పోలీసులు ఈ తెల్లవారుజామున భగ్నం చేశారు.  నేటితో భట్టి విక్రమార్క ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకి చేరుకోవడంతో..ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు నివేదిక ఇవ్వడంతో, భారీ ఎత్తున తరలివచ్చిన పోలీసులు, అక్కడున్న కాంగ్రెస్ శ్రేణులను చెదరగొట్టి, భట్టిని అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆపై ఆయన్ను పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు.


కాగా, తాను దీక్షను విరమించబోనని, ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని ఈ సందర్భంగా భట్టి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నీమ్స్ చేరుకున్న  పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం నాడు భట్టికి  నిమ్మరసం ఇచ్చి  దీక్షను విరమింపజేశారు. అయితే ఇది రాహుల్ గాంధీ సూచన మేరకు భట్టి విక్రమార్క దీక్షను విరమించారు.


ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. సీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్పీలో విలీనం చేయడంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్టు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఎందుకు కొనుగోలు చేస్తున్నారో  కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అధికార పార్టీ చేస్తున్న ఈ దుష్టచర్యలు కాంగ్రెస్ పార్టీకే కాదు తెలంగాణకే నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: