ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్‌ నిర్వహణపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షేకావత్‌ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు అన్ని రాష్ర్టాల గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రులు, అధికారులు హాజరయ్యారు. రాష్ట్రం తరపున మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడారు.

తాగునీటి సరఫరాపై కేంద్రం సమావేశం ఏర్పాటు చేసిందని తెలిపారు. నీటి సరఫరాకు రాష్ర్టాలు చేపడుతున్న చర్యలపై కేంద్రం సదస్సు నిర్వహించడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే మిషన్‌ భగీరథ పేరుతో ప్రతి ఇంటికి నీరు అందిస్తున్నామని చెప్పారు.

రూ. 45 వేల కోట్లతో మిషన్‌ భగీరథ పథకం ప్రవేశ పెట్టామని గుర్తు చేశారు. మిషన్‌ భగీరథను అన్ని రాష్ర్టాల అధికారులు పరిశీలించి.. ప్రశంసించిన విషయాన్ని కేంద్రమంత్రికి వివరించామని తెలిపారు. ఈ పథకం ద్వారా వేసవికాలంలో కూడా తాగునీటి కొరత లేకుండా చేయగలిగామని పేర్కొన్నారు.

మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థిక సాయం అందించాలని కోరామని తెలిపారు. ప్రాజెక్టు వ్యయంలో సగం ఖర్చును కేంద్రం ఆర్థిక సాయంగా అందించాలని కోరాం. ఏటా మిషన్‌ భగీరథ నిర్వహణకు రూ. 2 వేల కోట్ల ఖర్చు కూడా రాష్ర్టానికి భారంగా మారనుందని, కనీసం పథకం నిర్వహణ ఖర్చునైనా కేంద్రం భరించాలి అని ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: