ఇంటి గుట్టు ఇంట్లో వాడే రట్టు చేయాలి అన్న సామెత ఉంది. ఇప్పుడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. టీడీపీ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న సీనియ‌ర్ నేత గ‌ట్టును ఇప్పుడు ఆయ‌న అనుచరుడిగా ఉండి త‌మ పార్టీలోకి వ‌చ్చి మంత్రి అయిన వ్య‌క్తితోనే ర‌ట్టు చేయిస్తున్నారు. ఐదేళ్ల ఏపీ ప్రభుత్వ పాలనలో ప్రతి శాఖలోను లెక్కకు మిక్కిలిగా అవినీతి జరిగింది. పోలవరం, అమరావతి నిర్మాణం, రోడ్లు, పెన్షన్లు, జన్మభూమి కమిటీల‌ దోపిడీలు ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్ర‌తి స్కీము ఆ పార్టీ నేత‌ల దోపిడీకి అడ్డాగా మారింది. ఐదేళ్ల పాటు ఆ పార్టీలో మంత్రులుగా ఉన్న వారు సైతం లెక్క లేనట్టుగా దోచుకున్నారు. ఎక్కడ ఖాళీ స్థ‌లం కనబడితే దాన్ని క‌బ్జా చేసేశారు.


ఇక చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు ఆయన అనుచర వర్గం విశాఖలో రికార్డులు మార్చేసి మ‌రీ భూకబ్జాలకు పాల్పడ్డారన్న విమర్శలు అప్పట్లో తీవ్రంగా వచ్చాయి. చివరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న అప్ప‌టి మంత్రి అయ్యన్న పాత్రుడు సైతం గంటా భూకబ్జాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైసీపీ అధినేత జగన్ అప్పట్లో ప్రతిపక్షనేత హోదాలో విశాఖ నగరంలో ధర్నా చేపట్టారు. దీంతో చంద్రబాబు ప్రత్యేక విచారణ కమిటీ (సిట్‌) వేసి చేతులు దులుపుకున్నారు.


చంద్రబాబు ఏర్పాటుచేసిన సిట్‌కు వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. అయితే వీటిలో ఒక 300 ఫిర్యాదులను మాత్రమే విచారించిన సిట్ నివేదిక ఇచ్చేసింది. చివరకు ఆ నివేదికను చాలా రోజులు దాచేసి... లోపాలు క‌ప్పేశారు. ఇందులో చాలా లొసుగులు ఉన్నా బాబు ప‌ట్టించుకోలేదు. చంద్రబాబు క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన కబ్జాలను స‌ర్కార్ పూర్తిగా క‌ప్పి పుచ్చేసింది. ఎంతో మంది పేదల భూములు కబ్జా గురవ్వడంతో... ఇప్పుడు దాన్ని మళ్ళీ బయటకి తీసి గంటా లాంటి నేతల గుట్టును రట్టు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖలో కబ్జాకు గురైన భూ బాధితులను ఆదుకుంటాం అని ఆయన చెబుతున్నారు.


జగన్ సర్కారు దీనిని బయటకు తీస్తే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇక్కట్లు తప్పకపోవచ్చు అన్న చర్చ విశాఖ జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది. ప్రభుత్వ భూములు.. ఇతర అసైన్డ్ భూములు కబ్జా చేసి ఆయన అనుచరులు ఆక్రమించుకున్నారన్న‌ ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి గంటా వియ్యంకుడు    పరుచూరి భాస్కరరావు కబ్జా చేసిన భూములను తాకట్టు పెట్టి మరి భారీ ఎత్తున రుణాలు తీసుకున్నార‌న్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనిని బయటకు తీసి మళ్లీ విచారణ జరిపిస్తే పలు సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయి. ఇదిలా ఉంటే గంటాకు ఒకప్పుడు అనుంగు శిష్యుడిగా ఉన్న ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ విషయానికి సంబంధించి ప‌లు సంచ‌ల‌న విష‌యాలు బయటిపెట్టి రచ్చ చేసే ప్రయత్నాల్లో ఉన్నారట. ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన వెంటనే గంటాపై చేసిన కామెంట్లతో విశాఖ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వచ్చే ఐదేళ్ల పాటు విశాఖలో సరికొత్త రాజకీయ యుద్ధం చూస్తాం అంటూ అక్కడి మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: