పండ్లిచ్చే చెట్టుకు నీళ్లు పోయకుండా ఎండిపోయేవరకూ చూసి ఎందుకు ఎండిపోయింది అని ఆరా తీసిన చందంగా మారింది టీడీపీ పరిస్థితి. సాధారణంగా ఎన్నికల్లో గెలిస్తే ఒక రకంగా ఓడితే మరోరకంగా తీసుకుంటారు ఆయా పార్టీల వాళ్లు. ఇప్పుడు టీడీపీ కూడా ఎన్నికల్లో ఓడిపోయింది కాబట్టి వర్క్ షాప్ నిర్వహించి జరిగిన తప్పొప్పులను సమీక్షించుకుంటున్నారు. ఇప్పుడే ఆ పార్టీ నాయకలు చాన్స్ తీసుకుని తప్పు మీదంటే మీదంటూ


ఏకంగా అధినాయకత్వానిదే తప్పంటూ నిందలు వేస్తున్నారు. నిజానికి చంద్రబాబునాయుడు తప్పు కూడా చాలా ఉంది. పార్టీ గురించి పట్టించుకోకుండా, క్షేత్ర స్థాయి పరిస్థితులు అంచనా వేయకుండా టెలి కాన్ఫరెన్సులు, అధికారులు, ఆర్టీజీ, టెక్నాలజీనీ మాత్రమే నమ్ముకుని ఎన్నికలకు వెళ్లడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. పాలనా వ్యవహారాలతో పాటు పార్టీని కూడా చూసుకోవడం, క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోవడం ఎవరికైనా తలకుమించిన భారమే అవుతుంది. కానీ ఇక్కడ చంద్రబాబుకు మరో దారి లేకుండా పోయింది. పార్టీ బాధ్యతలు సమర్ధవంతంగా చూసుకునే నాయకుడే లేకుండా పోయింది.


ఫలితంగా ఎన్నికల్లో ఘోర ఓటమి. దీనిపై చంద్రబాబుకు ముందే ఒక అంచనా ఉందనేది ఒక అభిప్రాయం. అయితే తాను తీసుకొచ్చిన పథకాలు, డ్వాక్రా, మెప్మా మహిళల ఓట్లపై పెట్టుకున్న నమ్మకం, ఆర్టీజీఎస్ ఇస్తున్న రిపోర్టులు దెబ్బకొట్టాయి. ఫలితం తేడా కొట్టడంతో ఇప్పుడు నేతలు ఎవరికి వారు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో నేతలు ఎవరికి వారు తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు. చంద్రబాబు టెలికాన్ఫరెన్సులు దెబ్బకొట్టాయని, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చెప్పే అవకాశం ఇవ్వలేదని, అధికారులను నమ్మడం తప్పని, చుట్టూ ఉన్న భజన బృందం చంద్రబాబును తప్పుదారి పట్టించారని.. ఇలా పలువురు పలు రకాలుగా ఎవరికి వారు తమ వాదనలు వినిపించారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నాయకులు తమదైన పాత్ర పోషించలేదన్న వాస్తవాన్ని వారు ఇప్పటికీ గ్రహించకపోవడం. క్షేత్రస్థాయిలో ప్రజల పట్ల వారి తీరు బాగోలేకపోవడాన్ని వారు పట్టించుకోలేదు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూడండి అన్నారే తప్ప తాము తమ నియోజకవర్గ ప్రజలకు ఏం చేసామో చెప్పలేదు. చివరికి ఎన్నికల ప్రచారంలో ప్రతి అభ్యర్ధిలో తనను చూసి ఓటేయాలని చంద్రబాబు చెప్పుకునే పరిస్థితిని ఈ నాయకులు కల్పించారు. టీడీపీ నాయకుల పట్ల వస్తున్న ఆరోపణలను కూడా చంద్రబాబు ఎప్పుడూ తప్పుపడుతున్నట్టు ప్రజలకు తెలీలేదు. దీంతో విసిగివేసారిన ప్రజలు నాయకత్వ మార్పు చేసేసారు.



ఇప్పుడు నాయకులు అందరూ తప్పెవరిది అనేది కాకుండా ఇకపై ఏం చేయాలి, ప్రజల్లో పార్టీపై ఎలా నమ్మకం కలిగించాలి, అధికార పార్టీ చేస్తున్న దాడులను ఎలా తిప్పికొట్టాలి, ప్రజల్లోకి ఎలా వెళ్లాలనేదానిపై ఇప్పటినుంచే దృష్టి సారించాల్సిన అవసరముంది. తెలంగాణలో పరిస్థితి, ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితిని చూసి కూడా.. ఇక్కడ ఎన్నికల్లో వచ్చిన తీర్పును బట్టి చర్యలు తీసుకోకుండా ఇంకా తమ తప్పులనెరిగి ముందుకెళ్లకపోతే మరింత నష్టం తప్పదు.


TV9: హాట్ హాట్ గా సాగిన టీడీప వర్క్ షాప్. సమావేశానికి పలువురు గైర్హాజరు. నారాయణ, పితాని, గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, అయ్యన్నపాత్రుడు, అమరనాద్ రెడ్డి, సాంబశివరావు, రామ్మోహన్ నాయుడు, గొట్టిపాటి తదితరులు గైర్హాజరు. పార్టీలో తప్పొప్పులను ఎత్తిచూపుతూ సాగిన టీడీపీ రాష్ట్రస్థాయి సమావేశం. చంద్రబాబు చుట్టూ ఉన్న బృందంపై పలువురు నాయకులు ఫిర్యాదులు. అధికార వ్యవస్థ దుర్వినియోగమైందని వ్యాఖ్యలు. ఆరోపణలు వస్తున్న నాయకులపై చంద్రబాబునాయుడు చర్యలు తీసుకోకపోవడం కూడా ఒక కారణమన్న కొందరు నేతలు. టెలికాన్ఫరెన్సులను తప్పుపట్టిన అశోక్ గజపతిరాజు. ఆర్టీజీఎస్ ఇచ్చిన తప్పుడు నివేదికల వల్ల నష్టపోయామన్న నేతలు.


Ntv, అమరావతి: టీడీపీ వర్క్ షాప్ లో గళమెత్తిన టీడీపీ నేతలు. 5ఏళ్లలో పార్టీలో జరిగిన లోపాలను ఎత్తిచూపిన నేతలు. పార్టీ నేతల తీరు సరిగాలేదన్న కొంతమంది. బాబు టెలికాన్ఫరెన్సులను తప్పుపట్టిన అశోక్ గజతిరాజు. వేల మందితో కాన్ఫరెన్సులతో నిజాలు చెప్పే అవకాశాలు లేపోయిందని వ్యాఖ్య. పార్టీ నిర్లక్ష్యానికి గురవుతోందని నేతలు గుర్తించలేకపోయారని ఆవేదన. పార్టీలో హ్యూమన్ టచ్ లేకపోయిందని జూపూడి వ్యాఖ్య. రియల్ టైమ్ గవర్నెన్స్ రిపోర్టులు కొంప ముంచాయన్న గౌనివారి శ్రీనివాసులు. అధికారులను పక్కన పెట్టుకోవడంతోనే నష్టం జరిగింది. గ్రామస్థాయిలో నేతల అవినీతిని అధినేతకు చెప్పే అవకాశం లేకపోయిందన్న దివ్యవాణి. విభేదాలు వీడి కలిసి సాగుతామన్న అనంతపురం నేతలు. పార్టీ లీగల్ సెల్ ను పటిష్ఠ పరచాలన్న బీద రవిచంద్ర. వైసీపీ పెడుతున్న కేసులు, బిల్లుల చెల్లింపుల అంశాన్ని ఎదుర్కోవాలన్న బీద రవిచంద్ర.


మరింత సమాచారం తెలుసుకోండి: