కోమటిరెడ్డి సోదరులు కమలం గూటికి చేరడం ఖాయమేనా ? అంటే తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. తెలంగాణ లో కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదని, టీఆరెస్ కు బీజేపీ యే ప్రత్యామ్నాయమంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్య లిప్పుడు  హాట్ టాఫిక్ గా మారాయి. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణులను దిగ్ర్భాంతి కి  గురి చేశాయి. అసలే 12 మంది ఎమ్మెల్యేలు చేజారి పార్టీ కష్టకాలం లో ఉన్న తరుణం లో క్యాడర్ లో నైతిక స్థైర్యాన్ని నింపాల్సింది పోయి, పార్టీ కి అసలు భవిష్యత్తే లేదని వ్యాఖ్యానించడం ఎంతవరకు సబబని పలువురు పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.  


లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ లో నాలుగు స్థానాలు గెల్చుకున్న బీజేపీ నాయకత్వం, కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలపై వల వేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే పలువురు నేతలు కమలనాథులతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వీరంతా ఎప్పుడు గోడ దూకుతారన్నది తెలియకపోయినప్పటికీ, త్వరలోనే పార్టీ మారే అవకాశాలున్నాయన్న వాదనలు బలంగా విన్పిస్తున్నాయి.  కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు ఎంపీ లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి లు ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ తో ఒక హోటల్ భేటీ అయి, పార్టీ లో చేరే అంశం పై చర్చించారన్న ఊహాగానాలు విన్పించాయి. అయితే ఇద్దరు ఎంపీలు ఆ ఊహాగానాలను కొట్టి పారేస్తూ తాము కాంగ్రెస్ ను వీడేది లేదని స్పష్టం చేశారు.


ఒకవైపు కాంగ్రెస్ నేతలు, బీజేపీ లో చేరడం ఖాయమన్న ఊహాగానాలు విన్పిస్తోన్న తరుణం లో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ ఊహాగానాలను నిజం చేసే విధంగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓటమికి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంచార్జ్ కుంతియా నే కారణమని ఆరోపించిన రాజగోపాల్ రెడ్డి, నేతలంతా బీజేపీ వైపే చూస్తున్నారని పరోక్షంగా తన మనస్సు లో మాట చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: