రైతులకు రుణ మాఫీ పథకం నిధులు అందడానికి అన్ని మార్గాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం నిర్ణయించింది. సోమవారం సాయంత్రం ఇక్కడ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ఇందులో రైతు రుణ మాఫీ పథకం అమలుపై చర్చ జరిగింది. మరో రెండు విడతల డబ్బు రైతుల ఖాతాలకు విడుదల చేయాల్సి ఉంది.

 

ఆ పథకంతో తమకు సంబంధం లేదని, రుణ మాఫీకి సంబంధించి గత ప్రభుత్వం జారీ చేసిన బాండ్లను తాము సమ్మతించాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలపై టీడీఎల్పీ భేటీలో చర్చించారు. ఈ ప్రకటనలపై రైతుల్లో ఆందోళన నెలకొందని ఎమ్మెల్యేలు చెప్పారు. ఒక పథకం మొదలై సగం వరకూ అమలు జరిగిన తర్వాత అది నడుస్తున్న పథకం అవుతుంది తప్ప ఒక పార్టీ హామీ కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

 

ఈ పథకం కింద మిగిలిన చెల్లింపులు నిలిపి వేస్తే అది అమానవీయం అవుతుందన్నారు. ఐదు విడతల్లో రైతులకు ఈ పథకం కింద రూ.24, 500 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటికి రూ. 14,500 కోట్ల చెల్లింపులు జరిగాయని కొందరు ఎమ్మెల్యేలు చెప్పారు. నాలుగో విడతకు సంబంధించి కూడా కొంత మేర చె ల్లింపులు జరిగాయని, రైతులకు ఇంకా సుమారు రూ.8 వేల కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు.

 

దీనిని శాసనసభ, శాసనమండలిలో ప్రభుత్వం దృష్టికి తెచ్చి.. అన్ని విధాలుగా ఒత్తిడి తెచ్చి.. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యేలకు సూచించారు. అన్నదాతా-సుఖీభవ పథకానికి సంబంధించి రెండో వాయిదా రూ.నాలుగున్నర వేల కోట్లు రైతులకు అందచేస్తే ఈ ఖరీఫ్ లో వారికి పెట్టుబడులకు ఇబ్బందులు ఉండేవి కావన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: