చట్టసభలో హుందాగా నడుచుకొని దేశప్రజలకు మార్గ నిర్దేశనం చేయాల్సిన ప్రజాప్రతినిధులు గల్లీ నాయకుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. తమకు దేశం కంటే మతమే ముఖ్యమనే విధంగా సభా సంప్రదాయాలను తుంగలో తొక్కారు. ఇదంతా నిన్న భోపాల్ నుంచి ఎంపీగా ఎన్నికైన సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారంతో ప్రారంభమైంది.

ఆమె తన పేరుకు తన గురువు పేరును చేర్చి ప్రమాణం చేయబోగా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూ నినాదాలు చేశాయి. అలా మొదలైన నినాదాలు ఇవాళ్టి 17వ లోక్ సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ట్రెజరీ, ప్రతిపక్ష బెంచీల మధ్య నినాదాల పోటీగా మార్చేసింది. అధికార పక్ష సభ్యులు తమ పార్టీ విధానమైన హిందూత్వను చాటిచెప్పేలా నినాదాలు చేస్తే ప్రతిపక్షాలు దానిని ఎదుర్కొంటున్నట్టుగా తమ తమ పార్టీ విధానాలకు తగ్గ నినాదాలు చేశాయి. దీంతో సభలో 'జై శ్రీరామ్', 'జై మా దుర్గా', 'భారత్ మాతా కీ జై', 'అల్లాహు అక్బర్' నినాదాలు మార్మోగాయి.

కొందరు సభ్యులు ఇంకాస్త ముందుకెళ్లి కొన్ని పార్టీల సభ్యులని టార్గెట్ చేసి నినదిస్తే దానికి ప్రతిగా వాళ్లు కూడా నినాదాలు చేశారు. ప్రోటెం స్పీకర్ అలా నినాదాలు చేయకూడదని వారించినా ఈ నినదించడం ఆగలేదు.ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ లకు చెందిన కొందరు సభ్యులు తమ ప్రమాణ స్వీకరాన్ని నినాదాలతో ప్రారంభించారు. ఈ నినాదాలు రికార్డులోకి వెళ్లవని ప్రిసైడిండ్ ఆఫీసర్ రూలింగ్ ఇచ్చినప్పటికీ ఇవి కొనసాగాయంటే సభా సంప్రదాయాలు ఏ స్థాయికి పడిపోయాయో చెప్పనక్కర్లేదు.

పశ్చిమ బెంగాల్ సభ్యులు, ప్రత్యేకించి తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన ఎంపీలను జై శ్రీరామ్ నినాదంతో ట్రెజరీ బెంచీలలో ఉన్నవారు రెచ్చగొట్టారు. దీనిని ఎదుర్కొంటున్నట్టు టీఎంసీకి చెందిన కళ్యాణ్ బెనర్జీ తన ప్రమాణ స్వీకారం తర్వాత దుర్గా పాఠ్ పఠించారు. మరో టీఎంసీ సభ్యుడు అబూ తాహెర్ ఖాన్ తన ప్రమాణాన్ని 'బిస్మిల్లా, అర్-రెహ్మన్, అర్-రహీమ్'తో ప్రారంభించి జై శ్రీరామ్ నినాదాల మధ్య అల్లాహు అక్బర్ తో ముగించారు.

టీఎంసీ ఎంపీ ఖలీలుర్ రహ్మాన్ 'బిస్మిల్లా' అంటూ ప్రమాణం ప్రారంభించారు. తృణమూల్ కి చెందిన కాకోలీ ఘోష్ దస్తిదార్ జై శ్రీరామ్ నినాదాలను ఎదుర్కొనేందుకు జై కాళీ అని నినదిస్తూ వచ్చి జై హింద్ జై బాంగ్లా అంటూ ప్రమాణం ముగించారు. కొందరు టీఎంసీ ఎంపీలు జై మమత అని కూడా నినదించడం ఈ నినాదాల పోటీకి పరాకాష్ఠ.ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆసాంతం బీజేపీ, బీఎస్పీ, టీఎంసీ సభ్యులు బిగ్గరగా, పోటాపోటీగా, సభ హుందాతనాన్ని దిగజార్చేలా నినాదాలు చేశారు.

చాలా మంది బీజేపీ ఎంపీలు జైశ్రీరామ్, భారత్ మాతా కీ జై నినాదాలతో తమ ప్రమాణ స్వీకారాన్ని ముగించారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన సంభాల్ షఫీఖుర్ రెహ్మాన్ బార్ఖ్ వందే మాతరం నినాదానికి అభ్యంతరం తెలపడంతో ట్రెజరీ బెంచీల సభ్యులు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చిట్టచివరన మథుర ఎంపీ, సినీ నటి హేమామాలిని ప్రమాణ స్వీకారం చేసి రాధే రాధే, కృష్ణం వందే జగద్గురమ్ అని ముగించారు.

సభాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేసేటపుడు నినాదాలు చేయరాదని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా యుపి బీజేపీ సభ్యులు పట్టించుకోలేదు. సభ్యులు తమ తమ పార్టీ, ప్రాంత, భాష, నేతల నినాదాలను చేయడం చూసి అలనాడు మహానుభావులు నెలకొల్పిన సభా సంప్రదాయాలు ఎంత దారుణంగా మంట గలిశాయోనని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: