కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదని జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఎన్నాళ్లు మనుగడలో ఉంటుందో తాను చెప్పలేనని, ఇది కాంగ్రెస్ నాయకులపైనే ఆధారపడి ఉన్నదని, సీఎం కుమారస్వామి చేతుల్లో ఏమీ లేదని తెలిపారు.

 

శుక్రవారం ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ మాకు ఐదేండ్లు మద్దతు ఇస్తామని వాళ్లు (కాంగ్రెస్ నాయకులు) చెప్పారు. కానీ వాళ్ల పద్ధతి, రోజురోజుకు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మధ్యంతర ఎన్నికలు తప్పవన్న అనుమానం కలుగుతున్నది. ఈ పరిణామాలపై రాష్ట్ర ప్రజలకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్లు చాలా తెలివిగలవారు అని దేవెగౌడ పేర్కొన్నారు.

 

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌తో కలిసి పోటీ చేయడం వల్లే కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతిన్నదని మాజీ సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి నివేదించిన నేపథ్యంలో దేవెగౌడ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది.

 

మరోవైపు తండ్రి వ్యాఖ్యలపై దుమారం రేగడంతో సీఎం కుమారస్వామి దిద్దుబాటు చర్యలకు దిగారు. మానాన్న మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన చెప్పింది అసెంబ్లీ ఎన్నికల గురించి కాదు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల గురించి అని తెలిపారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం లేదని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: