వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. సీఎంగా ప్ర‌మాణం చేసి ఇంకా 20 రోజులు కూడా పూర్తికాలేదు. కానీ, ఇంత‌లోనే ఆయ‌న‌పై ఒత్తిళ్లు ప్రారంభ‌మ‌య్యాయా ?  తాను నిర్దేశించుకున్న ల‌క్ష్యం దిశ గా ప్ర‌యాణం చేయాల‌న్న జ‌గ‌న్‌కు ఒత్తిళ్లు ఎదుర‌య్యాయా ? అంటే.. నేరుగా జ‌గ‌న్ నోటి నుంచే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ముఖ్యంగా గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఓట‌మిపై స‌ర్వే చేయించిన‌ప్పుడు లేదా క్షేత్ర‌స్థాయి స‌మ‌స్య‌లు, ప్ర‌జ‌ల‌ను ప‌రి శీలించిన‌ప్పుడు రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపించాయి.

 ముఖ్యంగా ప్ర‌జా సంక‌ల్ప పాద యాత్రలో ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు ఇదే విష‌యంపై ఫిర్యాదులు చేశారు. ఈ క్ర‌మంలో తాను అధికారంలోకి రాగానే అవినీతిపై స‌మ‌రం చేస్తాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వ సేవ‌ల‌ను ప్ర‌జ‌ల‌కు ఉచితంగా అందేలా చూస్తాన‌న్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన కీల‌క ప‌నులు, ప్రాజెక్టుల‌పై జ‌గ‌న్ నిశితంగా దృష్టి పెట్టారు. అవ‌స‌ర‌మైతే.. ప్ర‌జాధ‌నం ఆదా అవుతుంద‌ని భావిస్తే.. తాను రివ‌ర్స్ టెండ‌ర్‌కు కూడా వెళ్తాన‌ని చెప్పారు. అదేవిధంగా ప్ర‌భుత్వంలో ఎక్క‌డా అవినీతి అనేది లేకుండా చూస్తాన‌ని హామీ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే అనేక రూపాల్లో త‌న కార్యాచ‌ర‌ణను జ‌గ‌న్ సిద్ధం చేసుకున్నారు. అయితే, ఈ క్ర‌మంలో తాజాగా నిర్వ‌హించిన ప్రాజెక్టుల స‌ద‌స్సులో జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

ప్రాజెక్టుల్లో అవినీతి జరగడానికి వీల్లేదు. టెండర్ల విధానాన్ని అత్యంత పారదర్శకంగా రూపొందించాలి. వ్యవస్థను బాగు చేసుకోవడానికి తపిస్తున్నాం. కళ్లు మూసుకోండని నాపై ఒత్తిడి తెచ్చారు... అయినా అవినీతిపై పోరాటానికి సిద్ధమయ్యా. ఒక పని రూ.100కు బదులుగా రూ.80కే జరుగుతుంటే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్దాం. మన ప్రభుత్వం పారదర్శకత దేశానికి ఒక సంకేతం పంపాలి. జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటును కోరాం. రాష్ట్రం తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉంది. అవినీతి వల్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అవినీతిని సహించబోమని పైనుంచి కింది స్థాయి వరకూ గట్టి సంకేతం పోవాలి. అని పేర్కొన్నారు. 

అయితే, దీనిలో కీల‌కంగా మారిన విష‌యం.. క‌ళ్లుమూసుకోండ‌ని త‌న‌పై తెచ్చిన ఒత్తిడి! ఎవ‌రు ఈ ర‌కంగా జ‌గ‌న్‌ను ప్రోత్స‌హించారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల నుంచి ఒత్తిడి వ‌చ్చిందా?  లేక‌, చంద్ర‌బాబుతో అంట‌కాగిన నాయ‌కుల నుంచి అభ్య‌ర్థ‌న వ‌చ్చిందా? అనేది చ‌ర్చ‌గా మార‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: