పేద పిల్లల తల్లులు తమ పిల్లల్ని ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో దేనికి పంపించినా సరే ‘అమ్మ ఒడి’ పథకం వర్తిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి సందేహాలకు, అపోహలకు తావులేదని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

 

‘పేద తల్లులు తమ బిడ్డల్ని ఏ బడికి పంపించినా అమ్మ ఒడి వర్తిస్తుందని బడిబాట కార్యక్రమంలో అక్షరాభ్యాసాల సందర్భంగానూ, విద్యా శాఖపై నిర్వహించిన సమీక్షలోనూ జగన్‌ వివరించారు. 3648 కి.మీ పాదయాత్రలోనూ ఆయన ఇదేవిషయాన్ని స్పష్టంగా చెప్పారు.

 

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతుల్ని, రూపురేఖల్ని మారుస్తామని ముఖ్యమంత్రి ఇదివరకే ప్రకటించారు. ప్రభుత్వ బడుల్ని మెరుగుపరిచే దిశగా అన్ని చర్యలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి వంద మందిలో 26 మంది నిరక్షరాస్యులు ఉంటే... ఏపీలో 33 మంది ఉన్నారు.

 

అక్షరాస్యత విషయంలో మన రాష్ట్రం దేశంలో అట్టడుగున ఉంది. ఈ పరిస్థితి మార్చి, పేదల పిల్లల్లో ప్రతి ఒక్కరూ బడికి వెళ్లి చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క తల్లీ తమ పిల్లల్ని బాగా చదివించాలన్న లక్ష్యంతో అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రకటించింది.. అని ప్రకటన వివరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: