లేని అవినీతిని టీడీపీకి అంటించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ఆదివారమిక్కడ ఆయన నివాసంలో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు.

 

విదేశాల్లో ఉన్న చంద్రబాబు.. వారితో ఫోన్‌ ద్వారా మాట్లాడారు. ‘అవాస్తవ ఆరోపణలతో లేని అవినీతిని టీడీపీకి అంటించాలని చూస్తే.. అది వారికే చుట్టుకుంటుంది. ఎప్పుడూ, తెలుగుదేశం.. ప్రజల పక్షమే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తుంది.

 

పోలవరం నిర్మాణ పనుల గురించి, ఇతర ప్రాజెక్టుల నిర్మాణంపై, రాజధాని నగర నిర్మాణ పనులపై అక్కడేదో అవినీతి జరిగిపోయినట్లుగా సీఎం జగన్‌, మంత్రులు మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు ఈ సందర్బంగా ఆక్షేపించారు. ముఖ్యమంత్రి, వైసీపీ నేతలు కావాలనే ఈ ఆరోపణలన్నీ చేస్తున్నారని, వాటిలో వాస్తవాలు లేవన్నారు. ఇలాంటి ఆరోపణలు రాష్ట్రానికి మేలు చేకూర్చేవి కావన్నారు.

 

తనకున్న బురదను టీడీపీకి అంటించడం ద్వారా టీడీపీ, వైసీపీని ఒకే గాటన కట్టాలని జగన్‌ చూస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకే ప్రజావేదిక అడిగామని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ చెప్పారు. ‘లేఖ రాశాం, దానికి జవాబివ్వకుండా, ఏ నిర్ణయం చెప్పకుండా సామాన్లు బయటపడేయడం మర్యాద కాదు’ అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: