సోమవారం ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘం ఈ వివరాలతో ఒక నివేదికను లోక్‌సభ ముందు ఉంచింది. ప్రధానంగా రియల్‌ ఎస్టేట్‌, గనులు, ఔషధాలు, పాన్‌ మసాలా, గుట్కా, పొగాకు, బంగారం, కమోడిటీలు, సినిమాలు, విద్యా రంగాలలో ఇలా లెక్కల్లోకి రాని ఆదాయం ఉన్నట్లు అధ్యయనాలు పేర్కొన్నాయి.

 

అయితే నల్లధనం ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడ పోగుపడుతోందన్న విషయమై కచ్చితమైన అంచనాలు లేవని, అలాంటి అంచనాలు వేయడానికి కచ్చితమైన, ఆమోదయోగ్యమైన పద్ధతి కూడా లేదని ‘దేశం లోపల, వెలుపల లెక్కల్లోకి రాని ఆదాయం/ఆస్తుల పరిస్థితి- ఓ శాస్త్రీయ విశ్లేషణ’ అనే పేరుతో రూపొందించిన నివేదికలో స్థాయీ సంఘం పేర్కొంది.

 

అంచనాలన్నీ పలు సర్దుబాట్లను పరిగణనలోకి తీసుకొని ఊహల ఆధారంగానే రూపొందించారని వివరించింది. ఇందుకు ఉపయోగించాల్సిన అత్యుత్తమ పద్ధతి లేదా విధానంపై ఏకరూపత, ఏకాభిప్రాయం రాలేదని తెలిపింది. నల్లధనంపై వివిధ సంస్థలు వేరువేరుగా కట్టిన అంచనాల వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి.

 

మన దేశం నుంచి తరలివెళ్లిన నల్లధనంపై విస్తుగొల్పే వివరాలు వెలుగులోకి వచ్చాయి. రూ.లక్షల కోట్లు మన తీరాలను దాటి వెళ్లాయని వెల్లడయింది. భారతీయులు 1980 నుంచి 2010 మధ్య వివిధ సమయాల్లో విదేశాల్లో దాచిన అక్రమ సంపద దాదాపు 216.48 బిలియన్‌ డాలర్ల నుంచి 490 బిలియన్‌ డాలర్ల వరకు (సుమారు రూ.15లక్షల కోట్ల నుంచి రూ.34 లక్షల కోట్ల) ఉందని అగ్రశ్రేణి  సంస్థలైన 'ఎన్‌ఐపీఎఫ్‌పీ', 'ఎన్‌సీఏఈఆర్‌', 'ఎన్‌ఐఎఫ్‌ఎం' నిర్వహించిన మూడు వేర్వేరు అధ్యయనాల్లో తేలింది.


మరింత సమాచారం తెలుసుకోండి: