ఎంత పెద్ద వ్యక్తులు ఆదేశాలిచ్చినా సరే అక్రమాలు, అవినీతి, దోపిడీ, ఇసుక మాఫియా, పేకాట క్లబ్బులను అంగీకరించొద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అక్రమాలు, దోపిడీ, లూటీలు తప్ప మిగతా ఏ అంశంలోనైనా ఎమ్మెల్యేలు చెప్పేదాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

 

ఏ స్థాయిలో ఉన్న వ్యక్తైనా, ఎంతటి పెద్దవారైనా సరే.. అక్రమాలు, అవినీతి, దోపిడీకి పాల్పడితే తమ ప్రభుత్వం సమర్ధించదని వెల్లడించారు. సోమవారం కలెక్టర్ల సదస్సులో జగన్‌ వారికి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు మీ దగ్గరకొస్తే చిరునవ్వుతో సాదరంగా ఆహ్వానించండి. వారిని విశ్వాసంలోకి తీసుకోండి. ప్రభుత్వానికి కలెక్టర్లు ఒక కన్నైతే, ఎమ్మెల్యేలు మరో కన్ను.

 

ఈ రెండు విభాగాలు కలిసి పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. రెండు లక్షల మంది ప్రజలు ఓట్లేస్తే గెలిచినవారే ఎమ్మెల్యేలు. వారు ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకొస్తారు. ఫలానా పనిచేస్తే మంచి జరుగుతుందని చెబుతారు. వాటిపై సానుకూలంగా స్పందించాలి. కలెక్టర్లు తమ ముఖంపై చిరునవ్వు చెదరనీయొద్దు.

 

ప్రజలొచ్చినా, ఎమ్మెల్యేలొచ్చినా కోల్గేట్‌ ప్రకటనలో చూపించినట్లు పళ్లను చూపించి చిరునవ్వుతో పలకరించి.. వారి పనులు చేసి పెట్టాలి... అంటూ సరదాగా వివరించారు. గత ప్రభుత్వ హయాంలో పింఛను కావాలంటే ఏ పార్టీకి ఓటేశారని అడిగేవారు. మీకొచ్చే ఫించనులో నాకెంత లంచం ఇస్తావని ప్రశ్నించేవారు. రేషన్‌కార్డు మంజూరు, మరణ ధ్రువీకరణ పత్రం, కులధ్రువీకరణ పత్రం జారీ ఇలా ప్రతి దాంట్లోనూ అవినీతికి పాల్పడ్డారు.  మనం ఆలా చేయద్దని హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: