తెరాసను ఓడించడమే లక్ష్యంగా భాజపాలో చేరాలని నిశ్చయించుకున్నట్టు మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉండి ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని.. అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నానన్నారు.

 

దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భాజపా నుంచి తనకు ఆహ్వానం అందిందని, రెండుసార్లు రాం మాధవ్‌తోనూ చర్చించానని వెల్లడించారు. నూటికి నూరు శాతం తాను పార్టీ మారడం ఖాయమన్నారు. తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయమని 10 రోజుల క్రితమే తాను చెప్పానని.. నేడూ అదే చెబుతున్నానని అన్నారు.

 

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జి ఆర్‌సీ కుంతియా పొరపాట్ల వల్లే తెలంగాణలో రెండోసారీ అధికారం కోల్పోయామని విమర్శించారు. రాష్ట్రంలో భవిష్యత్తులో భాజపా బలపడే అవకాశం ఉందని చెప్పారు. దేశంలోని యువత బలమైన నాయకత్వాన్ని కోరుకుంటోందన్నారు.

 

తమకు ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే తెరాస పిలిచినప్పుడే వెళ్లేవాళ్లమని చెప్పారు. స్వార్థంతో కాకుండా.. దూరదృష్టితో ఆలోచించి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టు రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అభిప్రాయం ఆయన వ్యక్తిగత విషయమని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: