గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, అమలు చేసిన కార్యక్రమాలు, అప్పట్లో చేసుకున్న ఒప్పందాలు, కాంట్రాక్టుల వంటి అంశాలన్నింటినీ ఆమూలాగ్రం సమీక్షించి.. ఎక్కడెక్కడ అక్రమాలు చోటుచేసుకున్నాయో వెలికితీసి.. చర్యలపై తగిన సిఫార్సులు చేసేందుకు ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

 

రాష్ట్ర విభజన తర్వాత పరిపాలనలో, పోలవరం, రాజధాని పనుల వంటి ప్రధాన ప్రాజెక్టుల్లో, గనుల లీజులు, ఐటీ ప్రాజెక్టుల వంటి వాటిలో, విద్యుత్తు రంగంలోని పీపీఏల్లో అవినీతి, అవకతవకలు, సమాచార దుర్వినియోగం, బంధుప్రీతి వంటివి చోటు చేసుకున్నాయా? అన్న అంశాల్ని ఉపసంఘం లోతుగా సమీక్షించడంతోపాటు చేపట్టాల్సిన చర్యలను సిఫార్సు చేయనుంది.

 

వీటితోపాటు పారదర్శక, అవినీతి రహిత పాలన, ప్రజాప్రయోజనాలే లక్ష్యాలుగా చేపట్టాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన విధానాలను ఉపసంఘం సూచిస్తుంది. ఈ మేరకు ఉప సంఘాన్ని నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీకి 6 వారాల గడువిచ్చింది.

 

గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతి బాగోతాలపైనే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. అప్పట్లో వివిధశాఖల్లో తీసుకున్న నిర్ణయాలు, విధానాలు, ప్రాజెక్టులకు సంబంధించి విచారణ జరిపిస్తామని తెలిపారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో విద్యుత్తు రంగంపై సమీక్ష సందర్భంగా సీఎం ఈ నిర్ణయాలను వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: