'ప్రజావేదికను కూల్చేయడం ద్వారా రాష్ట్ర విధ్వంసానికి వైకాపా ప్రభుత్వం నాంది పలికిందని తెదేపా నేతలు ధ్వజమెత్తారు. దానిని హుటాహుటిన కూల్చేయడం దుందుడుకు చర్య అని, ప్రభుత్వ కక్ష సాధింపునకు పరాకాష్టని మండిపడ్డారు. ప్రత్యామ్నాయ సమావేశ మందిరం ఏర్పాటు చేయకుండా, ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాన్ని అర్ధరాత్రి వేళ కూలగొట్టాల్సిన అవసరమేముందని విమర్శించారు.

 

కడప, హైదరాబాద్‌లలో సీఎం జగన్‌, ఆయన కుటుంబ సభ్యుల భవనాలు అక్రమంగా నిర్మించినవి కాదా? అని సమావేశంలో పలువురు నేతలు ప్రశ్నిం  చారు. ‘హైదరాబాద్‌లో మీ (సీఎం) నివాసం కబ్జా ప్రదేశంలో ఉన్నా అప్పటి ప్రభుత్వం దానిని కూలగొట్టిందా? మీ మేనమామ కడపలో బుగ్గవంకను ఆక్రమించి సినిమా థియేటర్లు నిర్మించలేదా? నిబంధనలకు వ్యతిరేకం కాబట్టి కూలగొట్టేయాలి కదా? అని ప్రశ్నించుకున్నారు.

 

'సీఎం జగన్‌ రాష్ట్ర నిర్మాణంపై దృష్టి పెట్టకుండా కూలగొట్టడంపై శ్రద్ధపెట్టారు. ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వమే కూలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. కూర్చున్న చెట్టుకొమ్మనే నరుక్కోవడమంటే ఇదే. రాష్ట్రంలో విత్తనాల కొరత తీవ్రంగా ఉంది. రాయలసీమలో వేరుశనగ విత్తనాల కోసం, ఉత్తరాంధ్ర, కోస్తాలో వరి విత్తనాల కోసం రైతాంగం ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి సమయంలో విత్తన పంపిణీపై దృష్టి పెట్టకుండా ప్రజావేదికను కూల్చడాన్ని ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకోవడమేంటి?

 

'ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన భవనాన్ని అర్థరాత్రి వేళ కూలదోయడం దేశంలోనే తొలిసారి. దీనిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతాం. ఇప్పటికే దీనిపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. వైకాపా అధికారం చేపట్టిన నాటినుంచి తెదేపా నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగాయి. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేస్తాం’ అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: