ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన  తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు  నడిచిన  బాటలోనే తెలంగాణ టీడీపీ నాయకులు నడవాలని నిర్ణయించుకున్నారు . తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ ఉనికే ప్రశ్నార్ధకమైన  నేపధ్యం లో, ఆ పార్టీ లో  మిగిలిన కొద్దిమంది  నేతలు కమలం గూటికి చేరనున్నారు .  టీడీపీ సీనియర్  నేతలు, మాజీ మంత్రులు  ఇనుగాల పెద్ది రెడ్డి , బోడ జనార్దన్ లతోపాటు  చాడ సురేష్ రెడ్డి ,  నేడు అమిత్ షా సమక్షం లో బీజేపీ లో చేరనున్నట్లు తెల్సింది .


 లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించడం , కేంద్రం లో రెండవసారి సంపూర్ణ మెజార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత , తెలంగాణ లో పార్టీ బలోపేతం పై ఆ పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది . దానిలో భాగంగానే ఇతర పార్టీలకు చెందిన నాయకుల్ని, ప్రజాప్రతినిధులను తమవైపు తిప్పుకోవాలని నిర్ణయించింది . కాంగ్రెస్ పార్టీ కి చెందిన   పలువురు ఎమ్మెల్యేలు ,  నేతల పై కమలనాథులు ఆకర్ష్ అస్త్రాన్ని సంధించారు . బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు చిక్కిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తాను పార్టీ మారడం ఖాయమని ... త్వరలోనే   బీజేపీ లో చేరుతానని ఇప్పటికే ప్రకటించారు .


 అసెంబ్లీ ఎన్నికల్లో ఐక్య కూటమి కట్టి, రాష్ట్రం లో టీడీపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది . అయితే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఇప్పటికే టీఆరెస్ గూటికి చేరుకోగా, మరొక ఎమ్మెల్యే మాత్రం పార్టీలో కొనసాగుతున్నారు . వెంకట వీరయ్య ఇచ్చిన షాక్ తో… టీడీపీ,  లోక్ సభ ఎన్నికల్లో అసలు పోటీ చేసేందుకు సాహసమే చేయలేదు . ఈ పరిస్థితుల్లో టీడీపీ లో కొనసాగితే రాజకీయ మనుగడ లేదని భావించిన పెద్దిరెడ్డి , బోడ  జనార్దన్, చాడ సురేష్ రెడ్డి లతో పాటు మెదక్ జిల్లా కాంగ్రెస్ నేత శశిధర్ రెడ్డి నేడు బీజేపీ లో చేరనున్నట్లు తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: