ప్రత్యేకహోదా కేసులతో పాటు ఇతర ఉద్యమాలపై గత ప్రభుత్వం పెట్టిన పోలీసు కేసులను ఉపసంహరించాలని, వివిధ పోలీస్‌ స్టేషన్లలో బనాయించిన రౌడీషీట్లను ఎత్తివేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

 

బాక్సైట్‌ తవ్వకాలపై గత ప్రభుత్వం జారీ చేసిన జిఒ నెంబర్‌ 97ని రద్దు చేయాలని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ప్రత్యేక హోదా డిమాండ్‌ను నీరుగార్చడమేగాక, హోదా కోసం ఉద్యమించిన వారిపై అక్రమంగా కేసులు బనాయించిందని పేర్కొన్నారు. ఈ కేసులను ఎత్తివేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించడం సముచితం, సమర్ధనీయమని వివరించారు.

 

హోదా సందర్భంలోనేగాక గత ప్రభుత్వం వివిధ తరగతుల ప్రజానీకం తమతమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ చేపట్టిన ఆందోళనలపైనా ఉక్కుపాదం మోపిందని తెలిపారు. ఉద్యమాలు శాంతియుతంగా నిర్వహించినా అక్రమ కేసులను బనాయించారని పేర్కొన్నారు.

 

మున్సిపల్‌ వర్కర్లు, విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులు, అంగన్‌వాడీలు, ఆశాలు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, పంచాయతీ వర్కర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిరుద్యోగులు, నిర్వాసితులు, దళితులు, గిరిజనులు, మద్యనిషేధ ఉద్యమకారులు, వివిధ సామాన్య తరగతుల ప్రజలపై, సంఘాల నేతలపై గత ప్రభుత్వం కేసులు బనాయించిందని తెలిపారు. నిష్కారణంగా వివిధ ఉద్యమకారులపై బనాయించిన కేసులన్నింటినీ ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఉపసంహరించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: