కొన్ని కొన్ని ఫోటోలు హృదయాలను పిండేస్తుంటాయి.  మనల్ని వెంటాడుతూనే ఉంటాయి.  ఎందుకు జరిగిందో తెలియదు.  ఎందుకు జరుగుతుందో తెలియదు.  వలస అన్నది ఇప్పటిది కాదు.  గత ఐదారు వందల సంవత్సరాలుగా వలసలు జరుగుతూనే ఉన్నాయి.  ఆఫ్రికా నుంచి మనుషులను అక్రమంగా తీసుకొచ్చి అంగట్లో అమ్మి బానిసలుగా మరచుకున్న దగ్గరి నుంచే వలసలు మొదలయ్యాయి. 

 టెక్నాలజీ  అభివృద్ధి చెందాక ఈ వలసలు మరింత ఎక్కువయ్యాయి.  అభివృద్ధి చెందిన దేశాలపైపు ప్రజలు వలస వెళ్లడం సహజమే.  దానికి అడ్డుకోవడానికి మార్గాలు ఉంటె ఉండొచ్చుగాని, మరీ దారుణంగా వ్యవహరిస్తే ఎలా.  అమెరికా-మెక్సికో సరిహద్దులో వలస వస్తున్న తండ్రి, అతని 23 నెలల పాప ఒక నదీతీరంలో ప్రాణాలు కోల్పోయి ఉన్న ఫోటో ప్రపంచవ్యాప్తంగా అందరినీ దిగ్భ్రాంతులని చేస్తోంది.

అమెరికా రానివ్వకపోవడంతో వలస వచ్చేవారు ఎలా ప్రాణాలకు తెగిస్తున్నారో ఈ ఫోటో అందరికీ గుర్తు చేసింది.  ఆస్కార్ ఆల్బర్టో మార్టినెజ్, అతని 23 నెలల పాప యాంజీ వలేరియాలు నదిని దాటుతూ మరణించారు. వీళ్లిద్దరూ ఎల్ సాల్వడార్ నుంచి ప్రయాణించి అమెరికాలోని టెక్సాస్ వైపు చేరుకున్నారని ఈ ఫోటో తీసిన జూలియా లె డ్యూస్ తెలిపింది. తండ్రి తన పాపను సరిహద్దు దాటి టెక్సాస్ వైపు దించి భార్యను తీసుకు రాబోయాడు.


భార్యను తెచ్చేందుకు ఈదుకుంటూ వెళ్తున్న తండ్రి తనను వదలి వెళ్తున్నాడనుకొన్న ఆ పసిపాప కూడా నీళ్లలోకి దూకింది. దీంతో ఆ పసిదానిని పట్టుకొని ఈదుతుండగా బలమైన కెరటం వచ్చి వాళ్లని తీసుకెళ్లిపోయింది. వాళ్లిద్దరి మృతదేహాలు మెక్సికో వైపున్న రియో గ్రాండె దగ్గర కనిపించాయి. వాళ్ల తలలపై నల్లని టీ షర్ట్ చుట్టుకుపోయింది. పాప తన చిన్న కుడిచేయి తండ్రి భుజం చుట్టూ వేసి కన్నుమూసింది.

అసలు ఈ తెగింపు కారణమైన వివాదాస్పద అమెరికా-మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి పట్టు పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న ఆ ఫోటో చూస్తే అసహ్యం వేస్తోందని.. కానీ ఆ తండ్రి అద్భుతమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. ఇక ఈ ఫోటోపై ప్రపంచం నలుమూలల నుంచి శోకతప్త సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువెల్ లొపేజ్ ఒబ్రడార్ మాట్లాడుతూ 'ఇలాంటి విచారకర సంఘటనలు జరుగుతాయి.అమెరికా వలసలను తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెబుతూనే ఉన్నాం, కానీ ఎడారిలో, నది దాటుతూ ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారని' చెప్పారు.

పోప్ ఫ్రాన్సిస్ సందేశం విడుదల చేస్తూ వాటికన్ 'వారి మరణంతో తీవ్ర విచారానికి గురయ్యాం. వారి గురించి, యుద్ధం, పేదరికం వంటి కష్టాల నుంచి పారిపోయే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన వలసదారులు అందరి గురించి ప్రార్థిస్తున్నాం' అని పేర్కొంది.అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీకి దిగాలని ఆశిస్తున్న కమల హ్యారిస్ ట్వీట్ చేస్తూ 'విపరీతమైన హింసకు భయపడి ఈ కుటుంబాలు శరణు కోరుతున్నాయి. వాళ్లు వస్తే ఏం జరుగుతోంది? ట్రంప్ ' మీరు వచ్చిన చోటికి వెళ్లమని' చెబుతున్నారు. ఇది అమానుషం. పిల్లలు చనిపోతున్నారు. మన నైతిక ఆత్మసాక్షికి ఇది మాయని మచ్చ' అని రాశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: