యోగి ఆదిత్యనాథ్ వరసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.  ఏ నిర్ణయం ఎలా ఎందుకు తీసుకుంటున్నారో అర్ధంకాని పరిస్థితి.  మొన్నటి రోజున ఎన్నికల్లో  అభ్యర్థుల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న యూపీ సీఎం.. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు.  


ఉత్తరప్రదేశ్ లో సామాజికంగా దళితులతో సమానంగా భావించే 17 అత్యంత వెనుకబడిన కులాలను షెడ్యూల్డ్ కులాల్లో చేర్చాలనే డిమాండ్ కొన్ని దశాబ్దాలుగా ఉంది. తరచూ ప్రభుత్వాలు కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేశాయి. కానీ అవకాశం రాగానే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వీరిని కూడా తనవైపు చేర్చేసుకుంది.

ఇప్పుడు మిగతా దళిత జాతులతో పాటు 17 అత్యంత వెనుకబడిన కులాలైన కహార్, కేవట్, మల్లాలు, నిషాద్, కుమ్హార్, కశ్యప్, బింద్, ప్రజాపతి, ధీవర్, భర్, రాజ్ భర్, ఢీమర్, బాథమ్, తుర్హా , మాంఝీ, మఛువా, గోడియాలు షెడ్యూల్డ్ కులాల సర్టిఫికేట్ పొందగలుగుతారు.ఈ 17 అత్యంత వెనుకబడిన కులాల జనాభా మొత్తం జనాభాలో దాదాపు 14 శాతం ఉంటుంది. అంటే ఇది ఒక అతిపెద్ద ఓటు బ్యాంకు. గత ఎన్నికల్లో వీళ్లంతా ఒక్కతాటిపై బీజేపీకి ఓటేశారు.

అత్యంత వెనుకబడటం కారణంగా వీళ్లు అటు వెనుకబడిన కులాల ప్రయోజనాలు, ఇటు దళితుల ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఇప్పుడు వీళ్లని షెడ్యూల్డ్ కులాల్లో చేర్చడంతో వీరికి లాభం చేకూరనుంది.ఈ చర్యతో బీజేపీ, ఓంప్రకాష్ రాజ్ భర్ పార్టీ అజెండాను కూడా లాగేసుకున్నట్టయింది. నిషాద్ పార్టీ, సుహెల్దేవ్ రాజ్ భర్ పార్టీలకు రాజకీయాలు చేయడం ఇకపై కష్టంగా మారనుంది.  

యోగి సర్కారుకి ఇది పెద్ద రాజకీయ విజయం కానుంది. 12 సీట్లలో జరగబోయే ఉప ఎన్నికల్లో యోగి ప్రభుత్వం దీనిని తన ఎజెండాగా ఉపయోగించడం ఖాయం. ఈ 17 అత్యంత వెనుకబడిన కులాల ద్వారా బీజేపీకి రాజకీయ ప్రయోజనం ఉంటుంది కానీ దళితుల్లో ఉన్న కులాలు దీనిని వ్యతిరేకించే ప్రమాదం పొంచి ఉంది.   


దళితుల నుంచి వచ్చే వ్యతిరేకతను యోగి సర్కార్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.  తమ సామాజిక కులాల జాబితాలో ఈ 17 బీసీల జాబితాను చేర్చడం వలన వీళ్లకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి.  ఆయా కులాల మధ్య పోటీ అధికం అవుతుంది.  విద్య ఉద్యోగ అవకాశాలు కొంతమేరకు తగ్గిపోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: