తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ తీరు ఏమాత్రం మారడం లేదు . తాము ఇంకా అధికారంలోనే ఉన్నామని ఆయన భావిస్తున్నట్లు అన్పిస్తోంది . టీడీపీ అధికారం లో ఉండగా లోకేష్ , సామాజిక వేదికల ద్వారా ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేస్తే మీడియా దానికి అధిక ప్రాధాన్యతనిచ్చి కవరేజ్ చేసేది . కానీ ఇప్పుడు పరిస్థితి మారింది . టీడీపీ అధికారానికి దూరమయింది . ఇక చినబాబు , సామాజిక వేదికల సావాసాన్ని వదిలి , ప్రజల్లోకి వచ్చి తానేంటో నిరూపించుకోవాల్సిన తరుణం ఆసన్నమయింది .


అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ క్యాడర్ నిస్తేజం అలుముకుంది. క్యాడర్ ను కలిసి వారిలో ధైర్యం నింపి... తానున్నానని భరోసా కల్పించాల్సిన చినబాబు,  ఇంకా సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తూ కూర్చుంటే వచ్చే ఫలితం ఏముంటుందన్న  ప్రశ్నలు విన్పిస్తున్నాయి . అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి ఓటమి పాలయిన లోకేష్, ఇప్పటికైనా తాను ప్రజాబలం ఉన్న నాయకుడినేనని నిరూపించుకోవాల్సిన అవసరముందన్న వాదనలు విన్పిస్తున్నాయి.


తెలుగుదేశం పార్టీ లో నెంబర్-2 స్థానం లో కొనసాగుతున్న లోకేష్ , అందర్నీ కలుపుకుపోయేందుకు ఇకనైనా ప్రయత్నాలు చేయాలని ఆ పార్టీ వర్గాలే సూచిస్తున్నాయి . ఇంకా తండ్రి చాటు బిడ్డ మాదిరిగా వ్యవహరిస్తానంటే లోకేష్ , రాజకీయ భవిష్యత్తు అధోగతి పాలుకావడం ఖాయమని అంటున్నారు.  ఇకనైనా తనని తాను నిరూపించుకునేందుకు చినబాబు ప్రజల్లోకి రావాలని , పార్టీ క్యాడర్ ను కలిసేందుకు క్షేత్రస్థాయి లో పర్యటించాలని కోరుతున్నారు . చూడాలి ఎంతవరకు చినబాబు సామాజిక వేదికలను వదిలి ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తారో...?


మరింత సమాచారం తెలుసుకోండి: