మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇస్తున్న భద్రతను ఏమాత్రం తగ్గించలేదని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. జాతీయ భద్రత మార్గదర్శకాలు నిర్దేశిస్తున్న సంఖ్య కంటే ఎక్కువగానే ఆయనకు భద్రత కల్పిస్తున్నామని తెలిపింది. మార్గదర్శకాల ప్రకారం.. చంద్రబాబుకు 58 మంది భద్రతా సిబ్బంది ఉండాల్సి ఉండగా, తాము 74 మంది సిబ్బందిని కొనసాగిస్తున్నామని వివరించింది.

 

భద్రతా సిబ్బందిని తగ్గించామని చెబుతున్న ఆయన అసలు ఏ విధంగా భద్రతను తగ్గించామో చెప్పడం లేదని కోర్టు దృష్టికి తెచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనకున్న జెడ్‌ కేటగిరీని చంద్రబాబు ప్రభుత్వం తొలగించిందని, ప్రస్తుతం చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ తాము ఆయనకున్న జెడ్‌ ప్లస్‌ కేటగిరీని తొలగించలేదని పేర్కొంది.

 

జెడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్న ప్రతిపక్ష నేత విషయంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదని తేల్చిచెప్పింది. చంద్రబాబుకు ఎక్కడెక్కడ, ఏయే సమయాల్లో ఎంత మంది భద్రతా సిబ్బంది ఉన్నదీ లిఖితపూర్వకంగా హైకోర్టు ముందుంచింది. ఈ వివరాలను పరిశీలించిన హైకోర్టు బాధ్యతాయుతమైన ఓ అధికారిని చంద్రబాబు వద్దకు పంపి, ఆయనకు ఈ వివరాలను తెలిపితే సమస్య పరిష్కారమవుతుందని అభిప్రాయపడింది.

 

2004–14 వరకు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనకు కల్పించిన భద్రత, ఇప్పుడు కల్పిస్తున్న భద్రతను పోల్చి, వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రతను కుదించిందని, జూన్‌ 25కు ముందున్న భద్రతను యథాతథంగా పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: