కొత్తగా ఒక్క అంగుళం అటవీభూమిని కూడా ఆక్రమణలకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని, ఈ విషయంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్‌) ప్రశాంత్‌కుమార్‌ ఝా స్పష్టంచేశారు. ప్రభుత్వపరంగా తమకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు, మద్దతు అందుతున్న నేపథ్యంలో తమకు అప్పగించిన విధులను అన్ని స్థాయిల్లోని అధికారులు, సిబ్బంది నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.

 

విధుల నిర్వహణ, అటవీ ఆక్రమణలను అడ్డుకునే క్రమంలో ఇటీవల కొన్నిచోట్ల చోటుచేసుకున్న ఘటనలతో అధికారులు, సిబ్బంది ఆత్మస్థైర్యం ఏమాత్రం దెబ్బతినలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి కేసులు పెట్టడంతోపాటు దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకుందని, అలాగే తమ విధుల నిర్వహణకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినందున వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. మంగళవారం సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ్యలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు.

 

సాగుకాలం జూలైలో మొదలుకానుండటంతో అడవుల్లో కొత్త ఆక్రమణలకు ప్రయత్నాలు మొదలయ్యాయని ఝా వెల్లడించారు. గతంలోనే గుర్తించిన అటవీభూమిలో మొక్కలు నాటేందుకు అధికారులు, సిబ్బంది వెళుతుండడంతో కొన్నిచోట్ల ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడుతోందన్నారు. గిరిజనులు, ఇతర రైతులు ఇప్పటికే సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీశాఖ అధికారులు బలవంతంగా చెట్లు నాటుతున్నారనే ఆరోపణలున్నాయి కదా అని అడగ్గా.. అలాంటిదేమీ లేదని బదులిచ్చారు.

 

సిబ్బందికి ఆయుధాలిస్తే ఇలాంటి దాడులు జరిగేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయని భావిస్తారా అన్న ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదన్నారు. అటవీ అధికారులకు కూడా ఆయుధాలు సమకూర్చాలని వస్తున్న డిమాండ్‌పై ఎలా స్పందిస్తారని ప్రశ్నించగా.. అలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే సూచనలు కనిపించడం లేదని పేర్కొన్నారు. స్మగ్లర్లు, అటవీ నేరస్తులపై తప్ప ప్రజలపై అటవీ అధికారులు ఆయుధాలను ప్రయోగించే పరిస్థితి రాదని స్పష్టంచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: