జబర్దస్త్‌.. తెలుగు టీవీ ఛానళ్లలో కొన్నేళ్లుగా ఎదురులేని కామెడీ ప్రోగ్రామ్ ఇది. ఇందులో అవకాశం వస్తే వచ్చే పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఈ క్రేజ్ ఆధారంగా కొన్ని మోసాలూ జరుగుతున్నాయి. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమాల్లో ఛాన్స్ ఇప్పిస్తామంటూ కొందరు మోసం చేస్తున్నారు.


మీకు కాస్త టాలెంట్ ఉంటే చాలు.. స్కిట్లు మేమే నేర్పిస్తాం.. అవకాశాలు కూడా ఇప్పిస్తాం అంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తున్నారు. క్వికర్, ఓఎల్‌ఎక్స్ వంటి యాప్ ల్లోనూ యాడ్స్ ఇస్తున్నారు. ఇవి చూసి ఆసక్తి ఉన్న కొందరు వీరిని సంప్రదించి నిలువునా మోసపోతున్నారు.


వీరు ముందు కొంత డబ్బు తమ ఎకౌంట్లో వేయమంటూ.. కొన్ని వీడియోలు పంపుతారు. మొదట 20 నుంచి 30 వేల వరకూ వసూలు చేస్తారు. ఆ తర్వాత ఆ వీడియోల్లో ఉన్నట్టు చేసి తమకు పంపించమని చెబుతారు. ఇలా విడతలు విడతలుగా కొంతమంది వద్ద నుంచి లక్ష వరకూ గుంజేస్తున్నారు.


ఇక మరికొందరు.. ఇదే సోషల్ మీడియాలో వారంరోజుల్లో మోడలింగ్‌ శిక్షణ, 15 రోజుల్లో జబర్దస్త్‌ స్కిట్లు నేర్పిస్తామంటూ ప్రకటనలతో బురిడీ కొట్టిస్తున్నారు. ఈ ప్రకటనలు చూసిన కొందరు యువతీయువకులు మోసపోతున్నారు.


ఇంకో విచిత్రం ఏంటంటే.. జబర్దస్త్‌, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ స్కిట్లలో కనీసం నలుగురైనా ఉండాలని.. మీకు తెలిసిన వారిని ఇంకో నలుగురిని తీసుకురమ్మని చెబుతారు. వారి వద్ద నుంచి కూడా వసూలు చేస్తున్నారు. ఇలా మోసపోయి తమ వద్దకు వచ్చిన కొన్ని కేసులను హైదరాబాద్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: