అన్నా.. తొమ్మిదేళ్ల తరువాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ గ్రామంలో టీడీపీ వాళ్లే స్టోర్‌ డీలర్లుగా ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా ఉన్నారు. వాళ్ల కథ చూద్దాం.. వాళ్లందరినీ తొలగించండి అంటూ వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ముందు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.

 

మంగళవారం కణేకల్లు పట్టణంలో వైసీపీ నాయ కుడు ప్రకాష్‌రెడ్డి స్వగృహంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరైన సందర్భంగా నాయకులు ఆయనతో మాట్లాడారు. జగన్‌ ముఖ్యమంత్రి అయినప్పటికీ గ్రామాల్లో తమ హవా ఏమీ జరిపించుకోలేక పోతున్నాం. ఇంకెన్నాళ్లు వేచి చూడాలి అంటూ వారు ప్రశ్నల వర్షం కురిపించారు.

 

ఈ నెల కూడా టీడీపీ వాళ్లే స్లోర్లలో సరుకులు అందిస్తున్నారు. తమకు పూర్తిగా అవమానం జరిగినట్లు అవుతోందని ఆవేదన వ్యక్తపరిచారు. దీనిపై ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి స్పందిస్తూ సెప్టెంబరు నెల నుంచి చౌకధాన్యపు డిపోలన్నీ వెళ్లిపోతాయి. నేరుగా వలంటీర్లే ప్రజలకు సరుకులు అందిస్తారు. ఇంకొక మాసం ఓపికపట్టండి. గ్రామాల్లో ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు అంటూ కార్యకర్తలను సముదా యించారు.

 

మంచితనంతో ప్రజల మనసులు గెలిచి వారిలో సుస్థిరస్థానం సంపాదించడమే జగనన్న లక్ష్యం. అందువలన ఎలాంటి చర్యలు, గొడవలు చేయవద్దు. అందరు ఓపిగ్గా ఉండాలంటూ ఎమ్మెల్యే కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు ఆలూరు చిక్కణ్ణ, కేశవ రెడ్డి, తిమ్మప్ప, నాగిరెడ్డి, బద్రీనాథ్‌, ప్రకాష్‌రెడ్డి, చంద్ర శేఖర్‌రెడ్డి, లోకేష్‌ గౌడ్‌, రామచంద్రప్ప, వేమన్న, భాస్కర్‌రెడ్డి, వన్నూరుసాబ్‌, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: