ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ  తరుపున గెల్చిన ఎమ్మెల్యేలు , ఆ పార్టీకి షాక్ ఇచ్చి వైకాపా లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది . టీడీపీ తరుపున విజయం సాధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు త్వరలోనే తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వైకాపా లో చేరనున్నారన్న  ఊహాగానాలు విన్పిస్తున్నాయి . వీరిలో గుంటూరు, ప్రకాశం , కృష్ణా జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది .   వైకాపాలో చేరే అంశమై ఆ పార్టీ  అధినేత , ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోనూ చర్చించి, ఇప్పటికే  ఆమోదం పొందినట్లు సమాచారం .


గతం లో వైకాపా తరుపున గెల్చిన 23 మంది ఎమ్మెల్యేలను , టీడీపీ అధికారం లో ఉండగా , పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి , తమ పార్టీలో చేర్చుకున్న విషయం తెల్సిందే . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలయింది . కేవలం 23 మంది మాత్రమే ఆ పార్టీ తరుపున ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు . 23 మందిలో ఆరుగుర్ని తమవైపు తిప్పుకుంటే టీడీపీ కి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తమ పార్టీ నేతలు  చెప్పినా , తాను  ఒప్పుకోలేదని అసెంబ్లీ వేదికగా జగన్ ప్రకటించారు . ఆలా చేస్తే తనకు చంద్రబాబు కు తేడా ఏముంటుందని ఆయన ఎదురు ప్రశ్నించారు .


టీడీపీ నుంచి వైకాపా లో ఎవరైనా చేరాలనుకుంటే తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి చేరాలంటూ జగన్  షరతు విధించారు . టీడీపీ నుంచి ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు తమ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వైకాపా లో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది . అదే జరిగితే టీడీపీకి గట్టి షాక్ తగిలినట్లేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు .


మరింత సమాచారం తెలుసుకోండి: