నిబంధనలు ఉల్లంఘించి నడిపే ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను స్వాధీనం చేసుకుంటామని రవాణా, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) వెల్లడించారు. అలాంటి బస్సులను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు క్యారేజీగా అనుమతి తీసుకుని స్టేజీ క్యారేజీలుగా నడిపేవారు తక్షణమే అలా చేయటాన్ని ఆపేయాలన్నారు.

 

లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ప్రతి ట్రావెల్స్‌ బస్సులోనూ ప్రయాణికుల జాబితాను ముందే పొందుపరిచే విధానం అమలయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. విజయవాడలోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం సమీక్ష అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నామని, ఇందుకోసం కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన వివరించారు.

 

ప్రమాదాల నియంత్రణకు రూ.100కోట్ల చక్ర నిధి(రివాల్వింగ్‌ ఫండ్‌) ఇచ్చేందుకు సీఎం జగన్‌ అంగీకరించారని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై అధ్యయనం కొనసాగుతోందని, 90రోజుల్లోగా విలీన కమిటీ నివేదిక అందిస్తుందని మంత్రి తెలిపారు. జర్నలిస్టుల బీమా, ఆరోగ్య కార్డులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి పేర్ని నాని అధికారులను ఆదేశించారు.

 

ఆంధ్రప్రదేశ్‌లో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులను గుర్తించేందుకు విస్తృతంగా తనిఖీలు చేసినట్లు రవాణా శాఖ కమిషనర్‌ ఆంజనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 374 బస్సులను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 54 బస్సులను సీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. వాటిలో పన్నులు చెల్లించకుండా తిప్పుతున్నవి నాలుగు, రెండో డ్రైవర్‌ లేకుండా నడుపుతున్న 4 బస్సులను పట్టుకున్నామని వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: