చంద్రబాబు ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత పెరగడానికి కారణమైన అంశాల్లో ఇసుక అంశం ఒకటి.. ఇసుక ఫ్రీ అని ప్రకటించడం.. కానీ టీడీపీ స్థానిక నేతలు ఇసుక రీచులను తమ అడ్డాల్లా భావించడం.. ఆ పార్టీకి చెడ్డపేరు తెచ్చింది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి వంటి జిల్లాల్లో ఇసుక మాఫియా కొత్త పుంతలు తొక్కింది.


ఇసుక ర్యాంపుల కారణంగానే అప్పటి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. ఎమ్మార్వో వనజాక్షిపై చేయిచేసుకోవడం.. ఆ ఇష్యూ బాగా వైరల్ కావడం టీడీపీ ప్రతిష్టను దిగజార్చాయి. అందుకే ఇసుక అంశాన్ని వైఎస్ జగన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.


కొత్త ఇసుక విధానం రూపకల్పనపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 5 నుంచి ఏపీఎండీసీ ద్వారా ఇసుకను విక్రయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న రేట్ల కన్నా తక్కువ రేట్లకే ఇసుకను అందించాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు.


అవినీతి లేకుండా. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా పర్యావరణాన్ని పరిరక్షించేలా పారదర్శక విధానం రూపొందించాలని జగన్ తెలిపారు. ఇసుక రీచ్‌ల వద్ద స్టాక్‌ యార్డులు, నగరాలు, పట్టణాల్లో అదనపు స్టాక్‌ యార్డులు ఏర్పాటుకు ఆదేశించారు. ఇసుక రీచ్‌ నుంచి స్టాక్‌యార్డు వద్దకు తరలింపునకు ఒక రశీదు, స్టాక్‌ యార్డు నుంచి వినియోగదారుడికి చేరేంత వరుకు మరొక రశీదు ఇవ్వాలని తెలిపారు.


ఇసుక రీచ్‌ల వద్ద సీసీ కెమెరాలు, వేబ్రిడ్జిల ద్వారా లెక్కింపుకు ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక తవ్వకాలు,తరలింపులో వాడే వాహనాలకు జీపీఎస్‌ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు,అక్రమ రవాణదారులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. మరి జగన్ జాగ్రత్తలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: