ఏపీలో వైసిపి బలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో అధికార పార్టీలో ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ప‌ట్టున్న మాజీ ఎమ్మెల్యే దెబ్బకు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టెన్షన్ టెన్షన్ పడుతున్నారట. అసలు విషయంలోకి వెళితే దర్శి నియోజకవర్గంలో బూచేపల్లికి మంచి పట్టు ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఒకసారి బూచేపల్లి సుబ్బారెడ్డి మరోసారి ఆయన తనయుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వ‌రుస విజయాలు సాధించారు.

ఈ ఎన్నికలకు ముందు తాను పోటీచేయ‌న‌ని శివ‌ప్ర‌సాద్‌రెడ్డి జ‌గ‌న్‌కు స్వ‌యంగా చెప్పడంతో జగన్ పేస్ ఇంజనీరింగ్ కళాశాల అధినేత మ‌ద్దిశెట్టి వేణుగోపాల్‌ను రంగంలో దించగా ఆయన ఘన విజయం సాధించారు. ఇక బూచేపల్లి సొంత నియోజకవర్గమైన సంతనూతలపాడులో గుంటూరు జిల్లాకు చెందిన టీజేఆర్‌. సుధాకర్ బాబును రంగంలోకి దింపగ ఆఆయన కూడా విజయం సాధించారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకుని తీసుకురావాలని కూడా జగన్ శివప్రసాద్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయగా... ఎన్నికల్లో ఈ ఇద్ద‌రి గెలుపు కోసం శివప్రసాద్రెడ్డి ఎంతో కష్టపడ్డారు. 


ఎన్నికల ప్రచారం లోనే శివప్రసాద్ రెడ్డి కి జగన్ ఎమ్మెల్సీ ఇస్తారు అన్న టాక్ వచ్చింది. ఇదిలా ఉంటే జిల్లాలో తాజాగా సీఐల బదిలీలు జరిగాయి. దర్శి సీఐగా ఎమ్మెల్యే వేణుగోపాల్ సిఫార్సు చేసిన వ్యక్తికి... ఒంగోలు రూరల్ సిఐగా సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకరబాబు సిఫారసు చేసిన వ్యక్తికి పోస్టింగులు దక్కాయి. ఈ పోస్టింగ్లు చేసేటప్పుడు కనీసం తనకు ఒక మాట కూడా చెప్పలేదని శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. అంతటితో ఆగని ఆయన నేరుగా జగన్ దగ్గరికి వెళ్లి పార్టీ కోసం మీరు చెప్పినట్టు కష్టపడి పనిచేసి రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించాన‌ని... ఇప్పుడు సీఐల బదిలీల్లో కనీసం ఒక్క మాట కూడా త‌న‌కు చెప్పలేదు అని ఫిర్యాదు చేశారట. 


వెంటనే సీఎం ఆఫీస్ నుంచి దర్శి, సంత‌నూత‌ల‌పాడు ఎమ్మెల్యేలకు మీరు వెంటనే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యే వెంట‌నే బూచేప‌ల్లి ద‌గ్గ‌ర‌కు వెళ్లి పొర‌పాటు అయ్యింద‌ని చెప్ప‌డంతో పాటు ఆయ‌న్ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డార‌ట‌. ఏదేమైనా ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోయినా రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో మంచి అనుచ‌ర‌గ‌ణం ఉన్న శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ఇద్ద‌రు సిట్టింగ్‌ల‌ను మొత్తానికి టెన్ష‌న్ పెట్టించార‌న్న టాక్ జిల్లా రాజ‌కీయాల్లో వినిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: