రూ.20 పెడితే జేబు రుమాలు రాని రోజుల్లో రూ.20లకు చీర అంటే...ఆ మ‌హిళ‌లు న‌మ్మేశారు. అందుకు సొంతం చేసుకునేందుకు ఎగ‌బ‌డ్డారు. అయితే, వారు ఊహించిన చీర‌లు దొర‌క‌లేదు. దీంతో తోపులాట...అనంత‌రం నిరుత్సాహానికి గుర‌య్యారు. పెద్దపల్లి జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పెద్దపల్లిలోని ఓ వస్త్ర దుకాణం ఆషాడం బంపర్ ఆఫర్ కింద కేవలం రూ.20కే చీర అని ప్రచారం చేసింది. ఆ ఆఫర్ కూడా ఒక గంట పాటే ఉంటుందని చాటింది. ఇక ఏమైనా ఉందా?. పెద్దపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీగా వచ్చిన మహిళలు గురువారం ఉదయాన్నేషాప్ ముందు ప్రత్యక్షమయ్యారు. దీంతో దాదాపు  కి.మీ మేర పెద్ద క్యూ లైన్ ఏర్పడింది. 


అలా షాప్ తెరిచారో లేదో.. చీరల కోసం అంతా ఎగబడ్డారు. కొద్ది సేపు తొక్కిసలాట జరిగింది. వాళ్లను అదుపు చేయలేక షాపు నిర్వాహకులు చేతులెత్తేశారు. పరిస్థితి తేడావస్తే అసలు షాపు ఉంటుందో.. లేదో అనుకున్నాడో ఏమో? యజమాని షట్టర్ క్లోజ్ చేశాడు. పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. మహిళలను అదుపు చేసేందుకు పోలీసులు అనేక ఇబ్బందులు పడ్డారు. దీంతో మేన్‌రోడ్ నుంచి వెళ్లే ద్విచక్ర వాహనదారులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 2 గంటల పాటు మసీద్ ఏరియాలోని మేన్‌రోడ్ మహిళలతో నిండిపోయింది. అధిక సంఖ్యలో మహిళలు రావడం, ఉన్న చీరలన్నీ అమ్ముడుపోవడంతో విధిలేని పరిస్థితిలో షాపు యజమాని దుకాణాన్ని మూసివేశాడు. దీంతో మహిళలు అసహనానికి గురయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: